పంచాయతీల నిర్వహణపై శిక్షణ
ఏలూరు(మెట్రో) : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 10 మండలాలకు చెందిన గ్రేడ్ 4, గ్రేడ్ 5 పంచాయతీ డెవలప్‌మెంట్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. జెడ్పీ సీఈవో, జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ప్రిన్సిపాల్ ఎం.శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్షేత్ర స్థాయి పాలనను పటిష్టం చేయడం, గ్రామ పంచాయతీల్లో సర్వీస్ డెలివరీ మెరుగుపరచడం, రికార్డుల సక్రమ నిర్వహణ, పంచాయతీ ఆస్తుల పరిరక్షణ, మంచినీటి సంరక్షణ పద్ధతులు, ఘన ద్రవ, మల వ్యర్ధాల నిర్వహణ, సొంత వనరుల పెంపుదల, 100 శాతం పన్నులు, పన్నేతర ఆదాయాల వసూళ్లు అనే లక్ష్యాల సాధనలో పంచాయతీ అధికారుల పాత్ర అత్యంత ప్రాధాన్యమని శ్రీహరి తెలిపారు. పంచాయతీ సొంతఆదాయ వనరుతో పాటు ఇంటి పన్ను మదింపు, వసూళ్ల ప్రక్రియపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్ ప్రసంగ రాజు, మాస్టర్ ట్రైనర్స్ జీడీ శ్రీనివాస్, సూర్య కుమార్, విజయ భాస్కర్, వెంకటేష్ పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్మికులకు రాయితీలు ప్రకటించినా.. ఇంతవరకు దానికి సంబంధించిన జీవో విడుదల చేయలేదని ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్లు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంఘ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. కార్మికుల పిల్లల వివాహా లకు రూ.40 వేలు, కార్మికుడి భార్య లేదా కూతురి డెలివరీకి రూ.30 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, మట్టి ఖర్చులకు రూ.20 వేల చొప్పున ఇచ్చేలా చూస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయినా ఇంత వరకు వీటికి సంబంధించిన జీవో విడుదల చేయలే దన్నారు. కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ విధానాన్ని అమలు చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశం అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏ.రాణికి అందజేశారు.
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంకు చెందిన రిటైర్డ్ హవాల్దార్ (ఆర్మీ) దంగల గోపాలకృష్ణ కేఎం కరియప్ప స్మారక పురస్కారం అందుకున్నారు. ఇటీవల విజయవాడలో హోం మినిస్టర్ అనిత చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఇండియన్ ఆర్మీలో అందించిన సేవలకు గుర్తింపుగా తనకు ఈ పురస్కారాన్ని అందచేసినట్లు తెలిపారు.


