సహకార సంఘ ఉద్యోగుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

సహకార సంఘ ఉద్యోగుల ధర్నా

Feb 22 2026 8:42 AM | Updated on Feb 22 2026 8:42 AM

సహకార సంఘ ఉద్యోగుల ధర్నా

సహకార సంఘ ఉద్యోగుల ధర్నా

అత్తిలి: సహకార సంఘ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్‌ జిల్లా సెక్రటరీ పి.కృష్ణశాస్త్రి డిమాండ్‌ చేశారు. డీసీసీబీ అత్తిలి బ్రాంచ్‌ వద్ద సహకార సంఘాల సీఈఓలు, సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 6వ రోజుకు చేరింది. ఈసందర్భంగా యూనియన్‌ జిల్లా సెక్రటరీ పి.కృష్ణశాస్త్రి మాట్లాడుతూ సహకార సంఘ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. జీఓ నెం.36 వెంటనే అమలు చేసి, 2019, 2024 సంవత్సరాలలో పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ చేపట్టాలని, అంతవరకు మధ్యంతర భృతి ఇవ్వాలని చెప్పారు. గ్రాట్యూటీ సీలింగ్‌ రూ.2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని, గ్రాట్యూటీ చట్టాన్ని అమలు పరిచి చట్ట ప్రకారం గ్రాట్యూటీ చెల్లింపు చేయాలని కోరారు. రిటైర్మెంట్‌ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, 2019 తరువాత సహకార సంఘాలలో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్‌ చేసి, వారికి కూడా జీఓ నెం 36 అమలు చేయాలని డిమాండ్‌ చేసారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలని, ఉద్యోగి సర్వీస్‌లో మరణిస్తే ఆ కుటుంబానికి ఆధారం లేకుండా పోతుందని, అందువల్ల ప్రతి ఉద్యోగికి రూ.20 లక్షల టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలని అన్నారు. సహకార సంఘాల ఉద్యోగుల చేపట్టిన సమ్మెకు మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌, ఎస్‌.ఇల్లిందలపర్రు పీఏసీఎస్‌ చైర్మన్‌ నడింపల్లి సత్యనారాయణరాజు సంఘీభావం తెలిపారు. వీరి న్యాయబద్ధమైన డిమాండ్లను సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యూనియన్‌ ఉపాధ్యక్షులు బలుసు శ్రీనివాసులు, 14 సహకార సంఘాల సీఈఓలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement