తూకం.. నిలువునా మోసం
వ్యత్యాసాలు వస్తే కేసులు నమోదుచేస్తాం
తణుకు అర్బన్ : చేపలు, మాంసం, ఇతర సరుకులు కొనుగోలు చేస్తున్నారా.. అయితే దుకాణాల్లో కాటాలను జాగ్రత్తగా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తూకాల్లో ఏకంగా కిలోకు 150 గ్రాములపైనే తేడాలు వస్తున్నాయి. తూనికలు, కొలతల అధికారులు తణుకులో ఈనెల 17వ తేదీన నిర్వహించిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. తనిఖీల్లో భాగంగా వెళ్లిన ప్రతి దుకాణంలోను తూకంలో భారీ వ్యత్యాసాలు వచ్చాయి. ఎలక్ట్రానిక్ తూకాలను సైతం తూకం ఎక్కువగా చూపే విధంగా సెట్టింగ్ చేసుకున్న తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. తక్కెడలు, ఇనుప కాటాలు వినియోగంలో ఉన్న సమయంలో అధికంగా మోసం జరిగేదని, ఎలక్ట్రానిక్ కాటాలు కదా అటువంటి మోసం జరగదనుకుంటున్న ప్రజానీకానికి షాకిచ్చే విధంగా తూకాన్ని వారికి అనుకూలంగా మార్చేస్తున్నారు. తణుకులో తూనికలు, కొలతల విభాగానికి చెందిన అధికారులు తూకాలు చెక్ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న కొందరు మాంసం, చేపల దుకాణాల యజమానులు తూకాలను దాచడం, దుకాణాలు మూసేయడం వంటివి లీగల్ మెట్రాలజీ అధికారుల దాడుల్లో బట్టబయలైంది. తూకంలో వ్యత్యాసం తెలుసుకున్న ప్రజానీకం మార్కెట్‌లో తూకంతో ఈ విధంగా మోసం చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కిలోకి 150 గ్రాములు తగ్గించేస్తున్నారు..
తణుకు మార్కెట్‌లో ఒక చికెన్ దుకాణంలో అరకిలో చికెన్ కొనుగోలు చేస్తే 400 గ్రాములు మాత్రమే వచ్చిందనే ఫిర్యాదుతో తణుకులో లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా తణుకు ఉండ్రాజవరం రోడ్డులోని చేపల దుకాణంలో రెండు కాటాలు కూడా 5 కిలోల రాయి పెట్టిన సందర్భంగా 5 కిలోల 725 గ్రాములు చూపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే కిలో చేపకు 150 గ్రాములు తక్కువ తూకం వస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే తణుకు మునిసిపాలిటీ పరిధిలోని మరికొన్ని దుకాణాల్లో సైతం నిర్వహించిన తనిఖీల్లో కిలోకి 100 నుంచి 150 గ్రాముల వరకు అధికంగా బరువు చూపుతుందని నిర్ధారణ అయ్యింది. తనిఖీలు చేసిన మూడు దుకాణాల్లో మూడు కూడా తూకం వ్యత్యాసం రావడం చూస్తుంటే మార్కెట్‌లో చేపలు, మాంసం దుకాణాలతోపాటు ఇతర దుకాణాల్లో తూకాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కక్కుర్తి కాటా
తణుకు మార్కెట్‌లో చేపలు, మాంసం దుకాణాల్లో తూకంలో వ్యత్యాసాలు
లీగల్ మెట్రాలజీ దాడుల్లో బట్టబయలైన వైనం
ఆందోళనలో ప్రజానీకం..
కఠిన చర్యలు తప్పవంటున్న అధికారులు
మార్కెట్‌లోని దుకాణాల్లో ఉన్న తూకాలు నిబంధనల ప్రకారం సక్రమంగా లేదని నిర్ధారణ అయితే కాటాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసులు నమోదుచేస్తాం. చాలా దుకాణాల్లో లీగల్ మెట్రాలజీ విభాగంచే కాటాలను సీలు వేయించుకోకుండా వినియోగిస్తున్నారు.. వారిపై కేసులు నమోదుచేస్తాం. ఎలక్ట్రానిక్ కాటాలను ఎక్కువ బరువు చూపించేలా సెట్ చేస్తే చర్యలు తీసుకుంటాం.
– టి.రాంబాబు, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్
తూకం.. నిలువునా మోసం
తూకం.. నిలువునా మోసం


