దాళ్వా వరిలో జింక్ లోపం
అత్తిలి: జిల్లాలో సాగులో ఉన్న దాళ్వా వరి పంటకు పలు ప్రాంతాల్లో జింక్‌లోపం, సల్‌పైడ్ విష ప్రభావం ఆశించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. రైతులు ఎర్ర తెగులుగా పొరబడే ఈ లోపాన్ని త్వరగా గుర్తించి, నివారణా చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సార్వా కంటే దాళ్వా వరిలో నారు నాటిన 2 నుంచి 4 వారాల్లో జింక్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. మెరక తీసిన పొలాల్లో జింక్ లోపం ఆశిస్తుంది. సేంద్రియ పదార్ధం వేసిన పొలాల్లో నారుమడిలో నారు తీసేసిన తరువాత నాట్లు వేసిన పంట చేలల్లో చలి, మంచు అధికంగా ఉండే ప్రాంతాలు, చౌడు ఉప్పు నేలల్లో భాస్వరం ఎరువు సిఫార్సుకు మించి ఎక్కువ మోతాదులో వేసిన చేలల్లో జింక్‌లోపం కనిపిస్తుంది.
లక్షణాలు..
జింక్ లోపించినప్పుడు మొక్కల పెరుగుదల కుంటుపడి, ఆకులు సన్నగా వచ్చి కొన్నిసార్లు నత్రజని లోపాన్ని పోలి ఉంటాయి. ప్రధానంగా మొక్క పైనుంచి 3 లేదా 4 ఆకు మధ్య ఈనె తెల్లగాపాలిపోతుంది. మధ్య ఈనె ముందుగా ఆకుపచ్చ నుంచి పసుపు రంగుకు తరువాత తెలుపు రంగుకు మారుతుంది. తరవాత దశల్లో ముదురు ఆకు చివరలో మధ్య ఈనెకు ఇరుపక్కలా తుప్పు రంగు లేదా ముదురు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ప్రతి 3 రుతువులకు ఒక సారి, అదే కొత్తగా వరి సాగుచేసే నేలలు లేదా చౌడు నేలల్లో రుతువులకు ఒకసారి ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ వేయాలి. దాళ్వా వేసే ప్రాంతాల్లో ప్రతి రబీలో జింక్ సల్ఫేట్ వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో భాస్వరం సంబంధిత ఎరువుల్లో జింక్ సల్ఫేట్ కలిపి వేయరాదు. కనీసం 2 – 3 రోజుల వ్యవధి ఉండాలి. భూసార పరీక్షల్లో జింక్ స్థాయి 0.65 ఎర్ర నేలల్లో, నల్ల నేలల్లో 0.7 పీపీఎం కంటే తక్కువగా ఉన్నప్పుడు ముందుగా నివారణ చర్యలు చేపట్టాలి.
సల్ఫైడ్ లక్షణాలు, నివారణ చర్యలు
ఈ సమస్య ప్రధానంగా మురుగు నీటి సౌకర్యం లేక నీరు నిలిచిపోయే పల్లపు భూముల్లో, వేర్లకు గాలి సరిగా తగలని పరిస్థితుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నేల నుంచి కుళ్లిన కోడిగుడ్ల వాసనలా ఉండే హైడ్రోజన్ సల్ఫైడ్ దుర్వాసన అకస్మాత్తుగా వెలువడుతుంది. ప్రభావిత మొక్కలను వేర్లతో బయటకు తీసి పరిశీలించినప్పుడు, వేర్లపై నలుపురంగు మచ్చలు కనిపిస్తాయి. అవి గాలికి తగిలిన కొన్ని సార్లు ఏవిధమైన లక్షణాలు కనిపించకుండా వెంటనే ఎరుపులేక గోధుమరంగుకు మారుతాయి. నత్రజని, భాస్వరం ఎరువులు వేసినప్పటికీ పైరు వేసిన 2 – 5 వారాల మధ్య పైరు మీద లోప ఏపుగా ఎదగదు. నీటిని మురుగు నీటి కాలువల ద్వారా బయటకు పంపి, చేలను ఎండగట్టడం ద్వారా వేర్లకు గాలి ప్రసరణ మెరుగుపడి, సల్ఫైడ్ వల్ల కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు అని మండల వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ చెప్పారు.
పాడి–పంట
దాళ్వా వరిలో జింక్ లోపం


