నిరుద్యోగులకు వంచన | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు వంచన

Feb 19 2026 9:39 AM | Updated on Feb 19 2026 4:41 PM

-

జాబు కావాలంటే బాబు రావాలన్న కూటమి

ఉద్యోగం వచ్చే వరకూ రూ.3,000 ఇస్తామని హామీ

గత రెండు బడ్జెట్లలో నిరుద్యోగ భృతి ఊసెత్తని చంద్రబాబు ప్రభుత్వం

మూడో బడ్జెట్‌లోను మొండిచేయి

యువతకు అండగా నిలిచిన జగన్‌ సర్కారు

సాక్షి, భీమవరం: జిల్లాలో ఎనిమిది ఇంజినీరింగ్‌, 55 వరకు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. పాలిటెక్నిక్‌, వృత్తి విద్య కోర్సులు కళాశాలలు 20కు పైగా ఉన్నాయి. వేల మంది విద్యార్థులు వీటిలో చదువుతున్నారు. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్‌ పూర్తి చేసి పోటీ పరీక్షల నిమిత్తం ఇంటి వద్ద, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు పట్టణాలతో పాటు విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌ తదితర నగరాల్లోని కోచింగ్‌ సెంటర్లలో ప్రిపేరవుతున్న వారు వేలల్లో ఉంటారు. కోచింగ్‌ సెంటర్లకు వేలు, లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. హాస్టల్‌, మెస్‌ నిమిత్తం నెలకు ఆరు వేలకు పైనే ఖర్చవుతుంది. తమ బిడ్డల భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి తల్లిదండ్రులు కోచింగ్‌ ఇప్పిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి తగిన ఉద్యోగం రాక కుటుంబం కోసం ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఎందరో. వీరిలో చాలామంది తమ చదువుకు తగిన ఉద్యోగం కోసం వేచి చూస్తున్నవారు ఉన్నారు.

ఉన్న వాటికి కొర్రీ

కొత్త ఉద్యోగాల కల్పన లేకపోగా ఉన్న వాటిని తొలగించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్నికల ముందు వలంటీర్ల జీతం రూ.10 వేలు చేస్తామని చెప్పి వారిని విధుల్లోకి తీసుకోకుండా జిల్లాలోని 8,616 మంది వలంటీర్లను పక్కన పెట్టింది. కూటమి నేతలకు మద్యం షాపులు కట్టబెట్టేందుకు ప్రైవేట్‌ మద్యం పాలసీ తేవడంతో గతంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన 893 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది రోడ్డున పడ్డారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఎంతోమంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, ఫీల్డ్‌ అసిస్టెంట్లపై వేటు వేశారు. జిల్లాలోని సచివాలయాల్లో 1,66 ఖాళీ పోస్టులు ఉండగా వాటిని భర్తీ చేయకుండా క్లస్టర్ల పేరిట ఉద్యోగులను క్రమబద్ధీరణ పేరుతో పక్కన పెట్టేశారు. సర్వేలు, అదనపు బాధ్యతలతో సచివాలయ ఉద్యోగులపై పనిభారం పెంచేసి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు.

గతంలో నిరుద్యోగులకు భరోసా

2014 –19 వరకు టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 34,108 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తే 2019–24లో వైఎస్సార్‌ ప్రభుత్వంలో ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే శాశ్వత, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో 15 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. వీటిలో సచివాలయ ఉద్యోగాలు 4,230 ఉన్నాయి.

నిరుద్యోగ భృతి చెల్లించాలి

నిరుద్యోగ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి రూ.3000 ఇస్తానని హామినిచ్చింది. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. నేను డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాను. సరైన ఉద్యోగాలు లేవు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలి. – పడవల దీపక్‌, రాయకుదురు

నిరుద్యోగ భృతికి మంగళం ?

నిరుద్యోగ భృతి ఇస్తానన్న హామీ గంగలో కలిపేశారు. రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు నిరుద్యోగ భృతి ఊసే లేకుండా పోయింది. బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయింపులు చేయకపోవడం చూస్తుంటే ఆ పథకం ఇక లేనట్లేనని అనిపిస్తోంది. ఏడాదికి రూ. 7,200 కోట్లు అవసరం ఉండగా మూడు బడ్జెట్‌లలో రూ.21,600 కోట్లు చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టింది. – సత్తి పవన్‌ మహేష్‌ రెడ్డి (చిన్నూ), వైఎస్సార్‌సీపీ అత్తిలి యూత్‌ విభాగ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement