నాగేంద్రసింగ్‌కు అవార్డు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రాథమిక స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకు అహర్నిశలు పాటుపడిన ఉపాధ్యాయుడు రాజ్‌పుట్ నాగేంద్రసింగ్ శిక్షారత్న అవార్డు అందుకున్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు విద్యా బోధన, దస్తూరి, మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్యం, తల్లిదండ్రులతో సమన్వయం, సాంస్కృతిక అంశాలు, క్రమశిక్షణ మొదలైన అంశాలను ప్రాతిపదికగా తీసుకుని నవాచారి గతి విద్యా సమూహ్ భారత్ సంస్థ జాతీయ ఇన్నోవేటివ్ శిక్షారత్న అవార్డులను ప్రకటిస్తుంది. ఈ మేరకు 2025–26వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 మంది ఉపాధ్యాయులను శిక్షారత్న అవార్డుకు ఎంపిక చేసింది. ఏలూరు శ్రీరాంనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రాజపుట్ నాగేంద్ర సింగ్ ఈ అవార్డుకు ఎంపికై న 8 మందిలో ఉన్నారు. ఆయనకు ఈ అవార్డును జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ మంగళవారం అందచేసి ప్రత్యేకంగా అభినందించారు.
తణుకు అర్బన్: తూనికలు, కొలతల విభాగం అధికారులు మంగళవారం తణుకులో విస్తృతస్థాయి దాడులు నిర్వహించారు. తణుకు ఎన్టీఆర్ పార్కు ప్రాంతంలోని చికెన్ దుకాణంలో అరకిలో చికెన్‌కు 100 గ్రాములు తక్కువ వచ్చిందనే ఫిర్యాదుతో లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ టి.రాంబాబు అదే చికెన్ దుకాణంలో మంగళవారం తనిఖీలు చేయగా తూకం సక్రమంగానే ఉన్నప్పటికీ కాటాకు సీలు లేకపోవడంతో కేసు నమోదుచేశారు. అలాగే తణుకు ఉండ్రాజవరంలోని చేపల దుకాణంలో ఏకంగా 5 కిలోలకు 750 గ్రాములు తూకం ఎక్కువ చూపడంతో అవాక్కయ్యారు. అతని వద్ద ఉన్న రెండు ఎలక్ట్రానిక్ కాటాలు కూడా అదే విధంగా చూపడంతో రెండు కాటాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు. ఆయన వెంట హెడ్ కానిస్టేబుల్ గణేష్ ఉన్నారు.
తణుకు అర్బన్: అనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తణుకులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణ ఎస్‌సై కె.శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇవి. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి గ్రామానికి చెందిన కొమ్ముకూరి సూరిబాబు (27) తణుకు రైల్వే స్టేషన్ రోడ్డులోని ఒక ఇంట్లోకి సుమారు పదిరోజుల క్రితం అద్దెకు దిగారు. దాదాపు అయిదేళ్ల క్రితం తణుకు ఇరగవరం కాలనీకు చెందిన తిరుమల అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న సూరిబాబు స్థానికంగా ఉన్న స్పిన్నింగ్ టెక్స్‌టైల్స్ సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఇక్కడ అద్దెకు వచ్చిన నాటి నుంచి భార్య తిరుమల అప్పుడప్పుడు వచ్చి వెళుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో గడియ పెట్టుకున్న సూరిబాబు తలుపులు తీయకపోవడంతో యజమాని అనుమానంతో భార్యతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం అర్థరాత్రి ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా సూరిబాబు ఉరి వేసుకుని ఉన్నాడు. మంగళవారం ఉదయం అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల సమాచారంతో ఎస్సై శ్రీనివాస్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తణుకు అర్బన్: తణుకు సజ్జాపురంలోని వస్త్ర దుకాణంలో మంగళవారం చోరీ జరిగింది. తల్లీపిల్లల ఆసుపత్రి వీధిలో రాఘవేంద్ర టెక్స్‌టైల్స్ పేరుతో నిర్వహిస్తున్న వస్త్రదుకాణం షట్టర్స్ వంచి దొంగలు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3.15 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు షట్టర్‌ను బలవంతంగా ధ్వంసంచేసి ఇద్దరు లోపలకు చొరబడిన వ్యవహారం సీసీ కెమెరాలో నమోదుకావడంతో విషయం బయటపడింది. ఈ ఘటనలో క్యాష్ కౌంటర్‌లో ఉంచిన సుమారు రూ.11 వేలు నగదును అపహరించుకుపోయారు. టైక్స్‌టైల్స్ యజమాని లక్ష్మణ్ దుకాణం పైఅంతస్తులో నివాసం ఉంటున్నప్పటికీ ఎటువంటి చప్పుడు కాలేదని చెబుతున్నారు. దుకాణ యజమాని ఫిర్యాదుతో ఎస్‌సై కె.శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిత్యం జనసంచారం ఉండే ఈ రోడ్డులో జరిగిన ఈ చోరీతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాగేంద్రసింగ్‌కు అవార్డు
నాగేంద్రసింగ్‌కు అవార్డు


