గ్రావెల్‌ దోపిడీకి ‘కొత్త మార్గం’ | - | Sakshi
Sakshi News home page

గ్రావెల్‌ దోపిడీకి ‘కొత్త మార్గం’

Feb 18 2026 7:57 AM | Updated on Feb 18 2026 7:57 AM

గ్రావ

గ్రావెల్‌ దోపిడీకి ‘కొత్త మార్గం’

ద్వారకాతిరుమల: కొందరు టీడీపీ నాయకులు మట్టి దోపిడీకి కొత్త మార్గం ఎంచుకున్నారు. గతంలో ఇసుకను ఖాళీ ప్రదేశాల్లో డంప్‌ చేసి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎలా రవాణా చేసేవారో.. ఇప్పుడు మట్టిని కూడా అలా రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో పగలూ, రాత్రి అనే తేడా లేకుండా పోలవరం కుడి కాలువ గట్టును తవ్వి, గ్రావెల్‌ మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి వద్ద పోలవరం కుడి కాలువ గట్టును కొందరు పచ్చనేతలు ఇష్టానుసారంగా జేసీబీతో తవ్వేస్తున్నారు. ఆ మట్టిని అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలించి గ్రామంలోని అందనాలమ్మ చెరువు వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో డంప్‌ చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అక్కడ నుంచి ఆ మట్టిని టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి, అమ్ముకుని, సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్‌ మట్టిని రూ.5 వేల నుంచి రూ. 6 వేలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వైపు కన్నెత్తి చూడని అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

బెర్మ్‌ల పేరుతో..

గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లకు ఇరువైపులా బెర్మ్‌లు నిర్మించేందుకు మట్టిని తరలిస్తున్నట్టు నాయకులు చెబుతున్నారు. మంగళవారం ద్వారకానగర్‌లోని సీసీ రోడ్ల బెర్మ్‌లకు కొంత మట్టిని వినియోగించారు. అయితే రోడ్లు నిర్మించిన కాంట్రాక్టర్‌ మట్టిని కొనుగోలు చేసి, బెర్మ్‌లు నిర్మించాలి. అలా కాకుండా అధికార పార్టీ నాయకులు కాలువ గట్టును కొల్లగొట్టి, బెర్మ్‌లు నిర్మించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

గోతులమయం

కాలువ గట్టుపై ఉన్న మట్టితో పాటు, ఆ ప్రాంతంలో పెద్దపెద్ద గోతులు తవ్వి గ్రావెల్‌ మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఆ గోతులు భవిష్యత్తులో ప్రమాదాలకు కారణం అవుతాయని స్థానికులు అంటున్నారు. రైతులు, పశువుల సంచారానికి వీలు లేకుండా కాలువ గట్టును ఇష్టానుసారం తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ధ్వజమెత్తుతున్నారు.

పోలవరం కాలువ గట్టుపై యథేచ్ఛగా గ్రావెల్‌ మట్టి తవ్వకాలు

ఇసుక తరహాలో ఖాళీ స్థలంలో మట్టి డంపింగ్‌

అక్కడి నుంచి రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు రవాణా

గ్రావెల్‌ దోపిడీకి ‘కొత్త మార్గం’1
1/1

గ్రావెల్‌ దోపిడీకి ‘కొత్త మార్గం’

Advertisement
 
Advertisement
Advertisement