తప్పుల తడకగా రీసర్వే
● ఒకరి భూమి మరొకరి పేరున నమోదు
● రీసర్వేలో అక్రమాలు, ట్యాంపరింగ్‌పై రైతుల ఆందోళన
కాళ్ల: భూముల ఖచ్చితమైన హద్దులు నిర్ధారించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన భూముల రీసర్వే తప్పుల తడకగా తయారైంది. ఒకరి భూమి మరొకరికి కట్టబెట్టడంతో రైతులు గొల్లుమంటున్నారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల్లోనూ తప్పులు దొర్లడంపై తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో పంపిణీ చేస్తున్న కొత్త పాస్‌పుస్తకాల్లో దాదాపు పదుల సంఖ్యలో ఎకరాలు ఇతరుల పేరున మారిపోయాయి. దీంతో మా భూములు వేరొకరి పేరున ఎలా చూపిస్తారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలానికి సంబంధించిన యజమానురాలి భర్త పేరు స్థానే వేరొకరి పేరు ఉండటం.. ఇలా ఒక్కటి కాదు తవ్వుకుంటూ పోతే అన్నీ తప్పుల తడకలే. దీంతో విసుగెత్తిన రైతులు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి తహసీల్దార్‌కు ఫిర్యాదును ఎండార్స్ చేశారు. విషయం తెలుసుకున్న రైతులు మంగళవారం కార్యాలయానికి వస్తే అధికారి కోసం గంటల తరబడి పడిగాపులు పడ్డారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రీ సర్వేలో దొడ్డనపూడిలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అధికారులు భూమి వద్దకు వచ్చి చేయాల్సిన పనిని కార్యాలయాల్లోనే కూర్చుని అడంగళ్ ప్రామాణికంగా తీసుకుని ఫారం 34 సెక్షన్ 9(2) ప్రకారం నోటీసు జారీ చేసి కొందరు రైతులకు మాత్రమే ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుండా పూర్తిచేశారని అంటున్నారు. నోటీసులు ఇచ్చిన రైతుల వద్ద ఎటువంటి దస్తావేజులు, లింకు దస్తావేజులు పరిశీలించకుండా భూములు రికార్డులు తారుమారు చేసి ఒకరి భూమి మరొకరి పేరుతో రికార్డులు తయారు చేశారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి భూ సమస్యలు పరిష్కరించాలని దొడ్డనపూడి గ్రామ నాయకులు కోరుతున్నారు.


