కూటమి హయాంలో ప్రజాస్వామ్యం అపహాస్యం
పెనుగొండ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కూటమి నేతలు చేసిన ఆరోపణలు నిజం కాదని దర్యాప్తు సంస్థలు తేల్చి చెప్పాయన్నారు. కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని దర్యాప్తు సంస్థలు నిర్ధారించడంతో కూటమి నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. దీంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్లు డాక్టర్ వైవీవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరెడ్డి ఫొటోలతో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేసి పలు ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవాలయాల్లో పూజలు చేసినా వారికి బుద్ధి రావడం లేదన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు నీచమైన ఆలోచనలతో అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, విడుదల రజని, బ్రహ్మ నాయుడులపై దాడులకు పాల్పడుతూ శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పెనుగొండ, పెనుమంట్ర జెడ్పీటీసీలు పోడూరి గోవర్ధన, కర్రి సుభాషిణి, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిన్నం ఏడుకొండలు, వైఎస్సార్ టీయూ రాష్ట్ర కార్యదర్శి పూరిళ్ల శ్రీను, నాయకులు సుంకర సీతారామ్, కర్రి వేణుబాబు, కోట వెంకటేశ్వరరావు, కేశవరపు గణపతి, శీలం ఏడుకొండలు, చింతపల్లి ప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.


