కూటమికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం
తాడేపల్లిగూడెం: వైఎస్సార్ సీపీ నాయకులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ అన్నారు. మంగళవారం పట్టణంలోని వైఎస్సార్ సీపీ నాయకుడు చిటకన ప్రసాద్ ఇంటికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. కూటమి నేతలు తిరుపతి లడ్డూపై దుష్ప్రచారం చేసి దేశంలోని 140 కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు. కానీ తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని సిట్ క్లీన్‌చిట్ ఇచ్చిందన్నారు. చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్‌లో పోలీసుల సమక్షంలోనే అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడం దారుణమన్నారు. కర్రలు, రాడ్‌లు తీసుకొచ్చి వచ్చిన వారిపై కేసులు నమోదు చేయకుండా అంబటి రాంబాబుపై కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. బీసీ నాయకుడు జోగి రమేష్ ఇంటిపై దాడి చేయడం హేయమన్నారు. గతంలో వంగవీటి రంగాను టీడీపీ హతమార్చిందని ఆరోపించారు. కాపు రిజర్వేషన్ల కోసం పాటుపడిన ముద్రగడ కుటుంబాన్ని అనేక చిత్రహింసలకు గురిచేసిన సందర్భాలు ప్రజలకు తెలుసన్నారు. వైఎస్సార్ సీపీని అణగ దొక్కాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని, నేలకు కొట్టిన బంతిలా ఉవ్వెత్తున పైకి లేవడం ఖాయమన్నారు. కూటమి వికృత చేష్టలతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని, పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విఽధించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కాపులపై దాడి చేస్తుంటే పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారన్నారు. లడ్డూ విషయంలో కూటమి నేతలు దొరికిపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు రామిరెడ్డి, ఇసరపు కాశీ, ప్లెక్సీ రాజా, నిడదవోలు భాస్కర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఇజ్రాయేల్


