ఉరి వేసుకుని వ్యక్తి మృతి
ఆకివీడు: స్థానిక సంతపేటకు చెందిన నమ్మి రాంబాబు(21) ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం గుర్తించారు. వివరాల ప్రకారం తాళ్లకోడులో ఇటీవల ఇల్లు నిర్మించుకున్న రాంబాబు తాపీ పని చేస్తుంటాడు. భోగి రోజు నుంచి రాంబాబు కనిపించడం లేదు. తాళ్లకోడులో ఓ ఇంటి నుంచి కుళ్లిన వాసన వస్తుందనే సమాచారం మేరకు పోలీసులు వెళ్లి రాంబాబు మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు మద్యానికి బానిసయ్యాడని, బైక్ చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. మృతుడి తల్లి కువైట్‌లో ఉంటుండగా, మృతుడు ఆకివీడు సంతపేటలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. మృతుడు అమ్మమ్మ సింహాచలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ జగదీశ్వరరావు, ఎస్సై హనుమంతు తెలిపారు.
నూజివీడు: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొన్న సంఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని మీర్జాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాపులపాడు మండలం కొత్తపల్లికి చెందిన రామిశెట్టి కొండలరావు(64) మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొత్తపల్లి నుంచి హనుమాన్‌జంక్షన్ వెళ్తూ మీర్జాపురంలో పెట్రోలు కొట్టించుకునేందుకు పెట్రోలు బంకులోకి వెళ్లేందుకు ఎడమ వైపు నుంచి కుడివైపునకు అకస్మాత్తుగా తిరిగాడు. ఇదే సమయంలో నూజివీడు నుంచి హనుమాన్ జంక్షన్ వైపునకు వెళ్తున్న కారు కంట్రోల్ అవ్వకపోవడంతో కొండలరావు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కొండలరావు ఎగిరి రోడ్డుపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు (టూటౌన్): ఆక్వా ఫీడ్ ధరలు పెంపు దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో ఆయన మాట్లాడుతూ ఫీడ్ తయారీ కంపెనీలు సిండికేట్ గా మారి ఏకపక్షంగా ఫీడ్ ధరలు పెంచడం తగదన్నారు. టన్ను ఫీడ్ కు రూ.4వే లు పెంచడం వలన ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఆక్వా రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సోయాబీన్ వంటి రా మెటీరియల్ ధరలు బాగా తగ్గినప్పుడు ఫీడ్ ధరలు తగ్గించలేదని, ఇప్పుడు రా మెటీరియల్ ధర పెరిగిందని ధరలు పెంచుతున్నట్లుగా కంపెనీలు చెప్పడం అన్యాయమన్నారు. ఇప్పటికై నా పెంచిన ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
పాలకొల్లు సెంట్రల్: మద్యం పంపకాల్లో వచ్చిన గొడవ కారణంగా ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటనలో కోర్టు ఇద్దరు ముద్దాయిలకు 14 రోజులు రిమాండ్ విధించినట్లు పట్టణ సీఐ కె.రజనీకుమార్ తెలిపారు. వారం రోజుల క్రితం చించినాడ బ్రిడ్జి పై ముగ్గురు మిత్రులకు మద్యం పంపకాల్లో వచ్చిన తగాదా వల్ల ముప్పర్తి జెస్లోన్‌ను బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి గెంటేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా జె.నాగసాయి, టి.వెంకటేశ్వరరావులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరచగా ఇరువురికి రిమాండ్ విధించారని పేర్కొన్నారు.
ఉరి వేసుకుని వ్యక్తి మృతి


