ముగిసిన నారసింహుని కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవాలు మంగళవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. భీష్మ ఏకాదశి పర్వదినం మొదలుగా ఆరు రోజులపాటు ఈ ఉత్సవాలను స్మార్త ఆగమ యుక్తంగా, పాంఛాహ్నిక దీక్షతో ఆలయ పండితులు, అర్చకులు కన్నులపండువగా నిర్వహించారు. ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి తీర్ధప్రసాదాలతో పాటు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాత్రి ఆలయంలో శ్రీపుష్ప యాగోత్సవ వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు రాత్రి ఆలయంలో స్వర్ణ శేష వాహనంపై 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు చేశారు. అనంతరం శ్రీపుష్ప యాగోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): సాగునీటి పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేని విధంగా జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. జిల్లా కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం ఇరిగేషన్‌శాఖ పై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఇరిగేషన్, డ్రెయిన్స్ అధికారులు సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు జిల్లాలో ఆయకట్టు వివరాలు, వంతులు వారీగా సాగునీటి సరఫరా, నీటి లభ్యత, కాలువల మూసివేత, అనంతరం చేపట్టే పనులపై శాసనసభ్యులు సమక్షంలో వివరించారు. రైతుల వద్ద నుంచి వాటర్ టాక్స్ కట్టించడానికి నీటి సంఘం సభ్యులు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, సాగునీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.


