విద్యుత్ పొదుపునకు ప్రాధాన్యత
భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక శక్తివనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని విద్యుత్ శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. భవ్య భీమవరంలో భాగంగా ఏర్పాటు చేసిన 63 సౌర వీధి దీపాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంప్రదాయ విద్యుత్ లైట్లకు బదులు సోలార్ ఆధారిత లైటింగ్ వల్ల విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు ఖర్చులు కూడా ఆదా అవుతాయని, పర్యావరణానికి మేలు జరుగుతుందని విద్యుత్ శాఖ మంత్రి, ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ పార్కులో ఏర్పాటు చేసిన సోలార్ లైటింగ్ యూనిట్‌ను మంత్రి రవికుమార్ ప్రారంభించారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో అందజేస్తున్న పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రవికుమార్ అన్నారు. భీమవరం 6వ వార్డు బొక్కావారిపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.


