నయన మనోహరం.. నారసింహుని పరిణయోత్సవం
ద్వారకాతిరుమల : ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరిపై నారసింహస్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుని ఉత్సవ మూర్తులను సుందరగిరిపై నుంచి కొండ కింద కల్యాణ మండపం వద్దకు పల్లకీ వాహనంలో తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కన్యాదానం జరిపారు. ఉదయం 11.10 గంటల సుముహూర్త సమయంలో స్వామి, అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. ఆ తరువాత వేద మంత్రోచ్ఛరణలతో మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను జరిపారు. ప్రభుత్వం తరుఫున గోపాలపురం ఏఎంసీ చైర్మన్ వై.బ్రహ్మరాజు, దేవస్థానం తరుఫున ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు, ఈఓ భద్రాజీ అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.
నలుగురికి గాయాలు
ఆకివీడు: ఎదురెదురుగా రెండు మోటార్‌సైకిళ్లు అతివేగంగా ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయరహదారిపై దుంపగడప గ్రామ అడ్డరోడ్డు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం కై కలూరు మండలం పెదరామవరంనకు చెందిన బొక్కవరపు రాఘవేంద్రరావు, సామియేలు పనిమీద ఆకివీడు వచ్చి తిరిగి తమ గ్రామానికి బైక్‌పై తిరిగి వెళ్తుండగా ఆకివీడు వెలంపేటకు చెందిన అల్లు మణికంఠ, ఎస్కే అభి, మరో వ్యక్తి మోటార్‌సైకిల్‌పై వస్తూ దుంపగడప అడ్డరోడ్డు సమీపంలో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బొక్కవరపు రాఘవేంద్రరావు (20) స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా అతడితోపాటు వచ్చిన సామియేలుకు తీవ్ర గాయాలయ్యాయి. మరో బైక్‌పై ఉన్న ముగ్గురికి కూడా గాయాలవడంతో చికిత్స నిమిత్తం 108లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాఘవేంద్ర చిన్నాన్న బొగ్గవరపు సాయిబాబా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై హనుమంతు నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
పాలకొల్లు సెంట్రల్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ రామాలయం సమీపంలో చోటుచేసుకుంది. బాధితురాలు సయ్యపురాజు పద్మ తెలిపిన వివరాల ప్రకారం ఆమె భర్త అర్ధకట్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆరు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉంటుండగా కుమార్తె ఇటీవల బ్లడ్ కేన్సర్‌తో మృతి చెందింది. జనవరి 26వ తేదీన పద్మ ఇంటికి తాళాలు వేసుకుని ఉండిలో ఉన్న అమ్మగారి ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయాన్నే స్థానికులు ఫోన్‌చేసి ఇంటి తాళాలు తీసి ఉన్నాయని సమాచారం ఇవ్వడంతో ఆమె ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటిలోని మూడు బీరువాలు పగల గొట్టి ఉన్నాయి. పది కాసుల బంగారు, రూ.50 వేలు నగదు, ద్విచక్ర వాహనం చోరీ జరిగినట్లు గుర్తించినట్లు చెప్పారు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో దొంగ ఇంటి ముందు గునపంతో తిరుగుతుండగా సీసీ కెమెరాలో రికార్డయ్యిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందన్నారు.
ద్వారకాతిరుమల: చిన వెంకన్న దివ్య క్షేత్రం శనివారం భక్తజన సంద్రమయ్యింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, అనివేటి మండపం, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, కల్యాణకట్ట, నిత్యాన్నదాన భవనం ఇలా అన్ని విభాగాలు భక్తులతో పోటెత్తాయి.
నయన మనోహరం.. నారసింహుని పరిణయోత్సవం
నయన మనోహరం.. నారసింహుని పరిణయోత్సవం


