పసిడి పరుగు
బంగారం.. అందనంత దూరం
ఏడాదిలో భారీగా పెరిగిన బంగారం ధరలు
ఆభరణాల వ్యాపారంపై ప్రభావం
జిల్లాలో సగానికి తగ్గిన అమ్మకాలు
ప్రస్తుతం 24 క్యారెట్లు గ్రా.18,506, 22 క్యారెట్లు రూ.16,582
అదే బాటలో వెండి పయనం
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ అ‘ధర’హో అనిపిస్తున్నాయి. కనీసం గ్రాము పసిడి కొనాలన్నా సామాన్యుడు భయపడేలా ధరలు పెరుగుతున్నాయి. గతేడాది జనవరి నుంచి బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో ఆభరణాల వ్యాపారం సగానికి పైగా తగ్గిందని వ్యాపారులు అంటున్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): బంగారం ధరల్లో 20 రోజుల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్ర స్తుతం ఆల్‌టైమ్ హైలో ధరలు ఉన్నాయి. భీ మవరం మార్కెట్‌లో గురువారం 22 క్యారెట్ గ్రాము రూ.16,852, 24 క్యారెట్ గ్రాము రూ.18,506కు చేరింది. ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకూ 22 క్యారెట్ గ్రాము రూ.13 వేల నుంచి రూ.14,500 ఉంది. 15 నుంచి 20వ తేదీవ రకూ రూ.15,500 నుంచి రూ.15,800 పలికింది. అలాగే 24 క్యారెట్ గ్రాము రూ.14 వేల నుంచి రూ.16 వేల మధ్య నడిచి ప్రస్తుతం రూ.18,506కు చేరింది.
పెళ్లిళ్ల సీజన్‌పై ప్రభావం
గతేడాది డిసెంబర్ తర్వాత వివాహాది శుభాకార్యాలు లేకపోగా వచ్చేనెల నుంచి ప్రారంభం కాను న్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లపై బంగారం ధరల ప్రభావం చూపనుంది. పెళ్లింట ఆభరణాల కొనుగోలు భారంగా మారనుంది. పెళ్లికి కచ్చితంగా అవసరమైన ఆభరణాలు కొనేందుకే రూ.లక్షల్లో వెచ్చించాల్సి రావడం సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చాలా మంది సూత్రాలు, తాడు వంటి వాటితో సరిపెడుతున్నారు.
పెట్టుబడిదారుల పంట పండింది
బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ధరల పెరుగుదల లాభాలను తెచ్చిపెడుతోంది. బిస్కెట్ బంగారం (24 క్యారెట్లు), క్వాయిన్స్ కొనుగోలు చేసి నిల్వ చేసుకున్న వారు లాభాలు చూస్తున్నారు. జిల్లాలో ముఖ్యంగా రొయ్యల చెరువులపై లాభాలు వచ్చిన వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నారు.
అదే బాటలో వెండి
సామాన్యుడికి అందుబాటులో ఉండే వెండి ధరలు కూడా బంగారంతో పోటీగా పెరుగుతున్నాయి. దీంతో వెండి కొనేందుకు ఆలోచిస్తున్నారు. సాధారణంగా బంగారం కొనుగోలు చేయలేని వారు వెండి వస్తువులతో శుభకార్యాలు చేసుకునేవారు. ప్రస్తు తం వెండి కొనేందుకు భయపడే పరిస్థితులు ఉన్నా యి. ప్రస్తుతం కిలో ధర రూ.4.04 లక్షల పలుకు తూ ఔరా అనిపిస్తోంది. కిలో 2022లో రూ.65,500, 2023లో రూ.70 వేలు, 2024లో రూ.77వేలు, 2025 జనవరిలో రూ.79 వేలు పలికింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి.
50 శాతానికి తగ్గిన కొనుగోళ్లు
భారీగా పెరుగుతున్న బంగారం ధరల వల్ల కొనుగోళ్లు 50 శాతం మేర పడిపోయాయని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురంలో భారీగా బంగారం వ్యాపారం జరుగుతుంది. అలాగే తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం వంటి పట్టణాల్లో పదుల సంఖ్యలో బంగారం దుకాణాలు ఉన్నాయి. గతేడాది మే నెల వరకు సగటున రోజుకు జిల్లాలో రూ.10 కోట్ల వరకు బంగారం వ్యాపారం జరిగితే ప్రస్తుతం రూ.5 కోట్ల మేర మాత్రమే లావాదేవీలు జరుగుతున్నాయి. ధరల పెరుగుదలతో అత్యవసరమైన వారు మినహా సాధారణ ప్రజలు ఆభరణాల కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు.


