పెనుగొండ క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ
పెనుగొండ: పెనుగొండ క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవీ థాంలో 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహ ప్రతిష్ట సప్తమ వార్షికోత్సవం బుధవారం దేశ విదేశాల నుంచి వచ్చిన వాసవీ భక్తుల జైజై నాదాల మధ్య భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు, ఉమా దంపతులు ధ్వజారోహణ చేసి మరకత శిల వాసవీ మాతకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వాసవీ శాంతి థాంలో నూతనంగా నిర్మించిన సంకల్ప మందిరాన్ని పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతీ (బాల) స్వామిజీ, ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు, కర్నాటక ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కేవీ రాంప్రసాద్, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ ప్రారంభించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో ఆలయం కిక్కిరిసింది. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ట్రస్టు ఉపాధ్యక్షుడు బొండాడ రాంపండు, ఎస్ సతీష్, ప్రధాన కార్యదర్శి కేఆర్ కృష్ణ, కోశాధికారి ఎన్‌ఎస్ శ్రీరామమూర్తి, కర్ణాటక ఆర్యవైశ్య మహిళా మహాసభ అధ్యక్షురాలు ఉమా సాయిరామ్, కోట్ల వెంకటేశ్వరరావు, కోట్ల సూర్యారావు పాల్గొన్నారు.
తణుకు అర్బన్ : అక్రమ మార్గంలో గ్రావెల్ రవాణాకు పాల్పడుతున్న లారీలను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు విజిలెన్స్ ఎస్పీ కె.నాగేశ్వరరావుకు వచ్చిన సమాచారంతో విజిలెన్స్, మైన్స్, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామం నుంచి గ్రావెల్ లోడుతో వచ్చిన 6 యూనిట్ల గ్రావెల్ లారీలు 5, 3 యూనిట్ల గ్రావెల్ లారీ ఒకటి తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో అదుపులో తీసుకున్నట్లు విజిలెన్స్ ఎస్సై కె.సీతారాము తెలిపారు. గ్రావెల్ లోడుతో ఉన్న లారీలకు సంబంధించి ఎటువంటి మైనింగ్ బిల్లులు లేకుండా, అధిక లోడుతో రవాణా చేస్తున్నట్లుగా నిర్ధారించి సదరు వాహనాలపై మైనింగ్ అపరాధ రుసుముగా రూ. 66 వేలు, అధిక లోడు కారణంగా రూ. 2.56 లక్షలు అపరాధ రుసుము విధించినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఏజీ కె.శ్రీధర్, ఇన్‌స్పెక్టర్ డి.ప్రసాద్ కుమార్, సీహెచ్.రంజిత్ కుమార్, మైనింగ్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ పి.అన్నపూర్ణ, రవాణా శాఖ అధికారి కేవీ.సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్) : కొయ్యలగూడెం మండలంలో పొంగుటూరు, గవరవరం గ్రామాల్లో నకిలీ మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, విత్తన కంపెనీల మోసాలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్టా భాస్కరరావు, కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక పవరుపేటలోని అన్నే భవనంలో నకిలీ మొక్కజొన్న విత్తనాలపై వారు బుధవారం మాట్లాడారు. విత్తన కంపెనీలు రైతులను మోసగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. కంపెనీల ఇష్టారాజ్యంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను మోసగించిన విత్తన కంపెనీ ప్రతినిధులపై చర్యలు తీసుకుని రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. రైతులు చేస్తున్న ఆందోళనకు రైతు సంఘం సంఘీబావం ప్రకటిస్తోందని చెప్పారు.
భీమవరం: పెన్నాడ – భీమవరం రైల్వే స్టేషన్ల పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు జీఆర్‌పీ ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతుడికి 40 ఏళ్లు వయస్సు ఉంటుందని, రైలు ఢీకొనడం వల్ల చనిపోయినట్లు భావిస్తున్నామన్నారు. మృతుడు నలుపు రంగు ప్యాంటు, నలుపు రంగు షర్ట్ ధరించి ఉన్నాడని, కుడి చేతి మీద షణ్ముఖరావు, లక్ష్మి అని పచ్చబొట్టు ఉందన్నారు. వివరాలు తెలిసిన వారు 99084 48729కు సమాచారం అందించాలని కోరారు.
దెందులూరు : దెందులూరు పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైనట్లు ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు. గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలికపై మంగళవారం రాత్రి 15 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. బాలుడు పరారీలో ఉన్నాడని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు తరలించినట్లు ఎస్సై చెప్పారు.
పెనుగొండ క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ
పెనుగొండ క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ


