కబడ్డీ పోటీల్లో కాంస్య పతకం
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన కెమికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సర విద్యార్థి వై శ్రీనివాస్ కబడ్డీ పోటీలో ప్రతిభను కనబరిచి కాంస్య పతకం సాధించాడు. విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్లో ఈనెల 21 నుంచి 26 వరకు జరిగిన మూడవ జాతీయ పురుషుల పారా కబడ్డీ పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించి కాంస్యం పతకం సాధించడం విశేషం. శ్రీనివాస్‌ను డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్, పరిపాలనాధికారి బీ లక్ష్మణరావు, అకడమిక్ డీన్ సాదు చిరంజీవి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ సుబ్బలక్ష్మి బుధవారం అభినందించారు.
ఆకివీడు: స్థానిక పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దేవర కొండ ఏడుకొండలు (58) చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు బుధవారం తెలిపారు. గత నెల 31న సెలవుపై తన స్వగ్రామం బాపట్ల వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని, అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు చెప్పారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారని ఎస్సై వివరించారు.
జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సు నుంచి పొగలు వచ్చిన ఘటన జంగారెడ్డిగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం ఆర్‌టీసీ డిపోకు చెందిన బస్సు బుధవారం ద్వారకాతిరుమల వెళ్లి మధ్యాహ్నాం స్థానిక కొత్తబస్టాండ్‌కు తిరిగి వచ్చింది. డ్రైవర్ వాహనాన్ని బస్టాండ్‌లో ఓ పక్కగా నిలుపుదల చేసి భోజనం చేసేందుకు వెళ్లారు. కొద్ది సేపటికి బస్సు ముందు భాగం నుంచి పొగలు రావడంతో స్థానికులు గుర్తించి సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు ముందు జాగ్రత్తగా బకెట్లతో నీటిని చల్లి పొగను కట్టడి చేశారు. ఇంజన్ వద్ద ఉన్న క్వాయిల్ వైర్లు డైరెక్ట్ కావడంతో పొగలు వచ్చాయని, వెంటనే బస్సును డిపోకు తరలించి క్వాయిల్ మార్చడం జరిగిందని డీఎం గంగాధరరావు తెలిపారు.
జూదరుల అరెస్ట్
ద్వారకాతిరుమల: పంగిడిగూడెంలో ఓ పేకాట స్థావరంపై బుధవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 7 గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 11 వేలు నగదు, 3 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. అదేవిధంగా ఐఎస్ జగన్నాధపురంలో అక్రమంగా నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 5,300 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై చెప్పారు. వీటిపై కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
కబడ్డీ పోటీల్లో కాంస్య పతకం
కబడ్డీ పోటీల్లో కాంస్య పతకం


