బెల్టు షాపుల్లో బరితెగింపు
అధిక ధరలకు అమ్మకాలు
● లైసెన్స్ షాపుల తరహాలో అమ్మకాలు, డిజిటల్ పేమెంట్లు, సిట్టింగ్ ఏర్పాట్లు
● క్వార్టర్‌పై రూ.50 అదనంగా అమ్మకాలు
● పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు
సాక్షి, భీమవరం: ‘‘ఎమ్మార్పీకి మించి అమ్మకాలు చేసినా, బెల్టులు ఏర్పాటు చేసినా మొదటిసారి రూ.5 లక్షలు జరిమానా విధించాలని, రెండో సారి తప్పుచేస్తే షాపు లైసెన్స్ రద్దుచేయాలి’’
– గతంలో ఎకై ్సజ్‌శాఖతో సమీక్ష సందర్భంగా మద్యం అమ్మకాలపై సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలివి.
ఈ హెచ్చరికలను మద్యం సిండికేట్ వర్గాలు ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. షరామామూలే అనుకున్నారేమో.. నిబంధనలు పక్కనపెట్టి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. జిల్లాలో 194 మద్యం దుకాణాలకు సుమారు 71 షాపులు పట్టణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాలో 123 షాపులు ఏర్పాటుచేశారు. మద్యం దుకాణాలు ఉన్న గ్రామాలు 30 శాతం ఉంటే లేనివి 70 శాతం వరకు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో కూటమి నేతల కనుసన్నల్లో బెల్టుల జోరు కొనసాగుతోంది. ఒక్కో లైసెన్స్‌డ్ షాపు పరిధిలో నాలుగు నుంచి పది వరకు బెల్టులు ఉన్నట్టు సమాచారం. కొందరు బెల్టు వ్యాపారులు పది చొప్పున బాటిళ్లు తీసుకువెళ్లి అమ్మకాలు చేస్తుండగా మరికొందరు డోర్ డెలివరీ చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఏకంగా కౌంటర్ పెట్టి అమ్మకాలు చేస్తున్నారు. బీర్లు, లిక్కర్‌కు సంబంధించి పదికి పైనే బ్రాండ్లు అందుబాటులో ఉంచుతున్నారు. రూ.99 క్వార్టర్‌తో పాటు ఏ బ్రాండ్ క్వార్టర్ అయినా బాటిల్‌పై రూ. 50 అదనంగా వసూలు చేస్తున్నారు. బార్లు, లైసెన్సుడు షాపుల్లో మాదిరి టేబుళ్లు, సిట్టింగ్ ఏర్పాట్లు సైతం ఉంటు న్నాయి. సాయంత్రం అయితే బజ్జీ, చికెన్ పకోడి బండ్లతో మినీ బ్రాందీ షాపులను తలపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్టుషాపులు సంప్రదాయంగా వస్తున్న తమ ఉపాధిని దెబ్బతీస్తున్నాయని కల్లు గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇటీవల అధికారులకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో బెల్టు అమ్మకాలు చేస్తున్న ఘటనలపై 698 కేసులు నమోదుచేసి 702 మందిని అరెస్టుచేశారు. 1183 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎకై ్సజ్ అధికారులు చెబుతుండగా లైసెన్సు షాపులకు ఎంతమేరకు జరిమానా విధించారనేది ప్రశ్నార్ధకమే.
మద్యం షాపుల వద్ద ఎమ్మార్పీ ధరల బోర్డులు ఏర్పాటు చేయాలన్న నిబంధన ఎక్కడా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. బీర్లు, రూ.99 క్వార్టర్లు మినహా మిగిలిన బ్రాండ్ల మద్యంపై క్వార్టర్, హాఫ్, ఫుల్‌తో నిమిత్తం లేకుండా బాటిల్‌పై రూ.10 పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కొత్త స్టాకు వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న బాటిళ్లపై కొత్త రేట్లతో స్టిక్కర్లు అతికించి అమ్మకాలు చేయాల్సి ఉంది. కాగా బాటిల్ ధరపై అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారు. అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్న ఐదు షాపులపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
బెల్టు షాపుల్లో బరితెగింపు
బెల్టు షాపుల్లో బరితెగింపు


