గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
భీమవరం(ప్రకాశం చౌక్): కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మూడు పెద్ద డయాస్‌లు, రెండు చిన్న డయాస్‌లు, గ్యాలరీ, స్టాల్స్, వివిధ శాఖలకు సంబంధించిన శకటాలను ఏర్పాటు చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలు ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్తు సరఫరాకు ఆటంకాలు లేకుండా చూడాలని, ప్రత్యామ్నాయంగా జనరేటరు ఏర్పాటు చేయాలని విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించామన్నారు. అధికారులందరూ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేలా సమన్వయంతో పనిచేయాలని కోరారు. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించేలా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వేడుకలను ఎక్కువ మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలన్నారు.


