సంరకాంతి బరుల్లో మినీ బార్లు
మద్యంపై ఇప్పటికీ అదే ఊపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇటీవల జరిగిన సంక్రాంతి వేడుకలను కూటమి నేతలు అక్రమ ఆదాయానికి మార్గంగా మార్చుకున్నారు. కోడి పందేల బరుల వద్ద మినీ బార్లు ఏర్పాటు చేశారు. మాంసం విక్రయాలతోపాటు మద్యాన్ని ఏరుల్లా పారించారు. ప్రతి బరిలో రెండు, మూడు బెల్టుషాపులు ఏర్పాటు చేసి మరీ 24 గంటలు నిరంతరాయంగా విక్రయించారు. అధికారిక లెక్కల ప్రకారం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సంక్రాంతి మూడు రోజుల్లో రూ.42.34 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
రూ.కోట్లు మిగుల్చుకుని..
పండుగను వ్యాపారంగా మార్చి జూద క్రీడలు నిర్వహించడం ద్వారా వచ్చిన రాబడిపై తర్జనభర్జనలు ప్రారంభమయ్యాయి. అందరి కంటే మిన్నగా బరి నిర్వాహకులు అత్యధికంగా లబ్ధి పొందారు. అందులోనూ భారీ బరులు ఏర్పాటు చేసిన నిర్వాహకులైతే రూ.కోట్లలో మిగుల్చుకున్నారు. బరుల్లోనే పేకాట, బెల్టుషాపులు, సిగరెట్ షాపులు, వెజ్, నాన్ వెజ్, మినీ హోటళ్లు ఇలా సమస్తం విక్రయించారు. ఇక ప్రతి పందేనికీ 10 శాతం కమీషన్లు గెలిచిన వారి నుంచి వసూలు చేశారు. ఎస్సై మొదలు పోలీస్ ఉన్నతాధికారుల వరకు, ఎకై ్సజ్ కిందిస్థాయి సిబ్బంది మొదలు డిప్యూటీ కమిషనర్ వరకూ కూటమి నేతల ఒత్తిళ్లతో వ్యవస్థను పూర్తిగా వదిలేయడంతో ప్రతి బరిలో మినీ బార్ తెరుచుకుంది. ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక భారీ బరిలో మద్యం విక్రయాల కోసం 4 చోట్ల బెల్టుషాపులు, వాటికి అనుబంధంగా కూల్‌డ్రింక్ షాపులు ఏర్పా టు చేసి బరి నిర్వాహకులకు రూ.3 లక్షలు చెల్లించారు. క్వార్టర్‌కు రూ.30 నుంచి రూ.50 పెంచి మూడు రోజులపాటు విక్రయించారు. జిల్లావ్యాప్తంగా 400కు పైగా బెల్టుషాపుల్లో రూ.15 కోట్ల పైనే మద్యం విక్రయాలు జరిగినట్టు అంచనా.
మద్యం ఏరులు
ఉమ్మడి జిల్లాలో 400కు పైగా బెల్టుషాపులు
మూడు రోజుల్లో రూ.42.34 కోట్ల మద్యం విక్రయాలు
కూటమి నేతలు నిర్ణయించిందే బెల్టు ధర
ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మకాలు
పండుగ ఊపును ఉమ్మడి జిల్లాలో ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం క్వార్టర్ మద్యంపై రూ.10 పెంచుకోవడానికి అనుమతించగా.. వ్యాపారులు మరో రూ.10 కలిపి రూ.20 చొప్పున పెంచి జిల్లాలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఏలూరు జిల్లాలోని 155 మద్యం దుకాణాల్లో పండుగ మూడు రోజుల్లో రూ.21.34 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 194 షాపుల్లో రూ.22 కోట్ల విక్రయాలు జరిగాయి. సాధారణంగా ఉమ్మడి జిల్లాలో రోజూ సగటున రూ.8 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. పండుగ రోజుల్లో పందెం బరుల్లో బెల్టుషాపుల దెబ్బకు మద్యం వ్యాపారం రెట్టింపైంది.


