సచివాలయ ఉద్యోగులకు పని ఒత్తిడి
ఏలూరు (టూటౌన్): రాష్ట్రవ్యాప్తంగా పని ఒత్తిళ్లతో అసువులు బాసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉద్యోగులు శుక్రవారం అంజలి ఘటిస్తూ నివాళులర్పించారు. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సచివాల య ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం పని భారం తగ్గించాలని కోరుతూ నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భాను ప్రతాప్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉ ద్యోగుల సంఘం నాయకుడు జీవీఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ఉద్యోగులను వేధించడం ఆపాలన్నారు. సర్వే లు, యాప్‌ల పేరిట పని ఒత్తిడి పెరిగి ఉద్యోగులు మానసిక ఆందోళనలతో బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త మపై పాలకులు సవతి తల్లి ప్రేమ చూపడం దుర్మార్గమన్నారు. మిగతా ప్రభుత్వ శాఖల మాదిరిగానే సచివాలయ ఉద్యోగుల శాఖను చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల మరణించిన ఉద్యోగు ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నగరపాలక సంస్థ పరిధిలోని 79 సచివాలయాల ఉద్యోగులు పాల్గొన్నారు.
భీమవరం: పట్టణంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు శుక్రవారం కొనసాగాయి. డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మందికి 197 మంది, విష్ణు ఇంజనీరింగ్‌లో 100 మందికి 99 మంది హాజరయ్యారు.
భీమవరం(ప్రకాశం చౌక్): అన్న క్యాంటీన్ల నిర్వహణపై ఫిర్యాదులు అందితే ఊపేక్షించబోమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల రుచి చూసి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. క్యాంటీన్ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అనంతరం ఏరియా ఆస్పత్రి వద్ద ఆక్రమణలు తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ గ్రీనరీ అభివృద్ధి చేయాలని సూచించారు. ము న్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ మున్సిపల్ కమిషనర్ ఎ.రాంబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి పార్థసారథి ఉన్నారు.
ఇసుక నిల్వలను సిద్దం చేయాలి
జిల్లాలో అవసరమైన ఇసుక నిల్వలను ముందస్తుగా సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
ఏలూరు (టూటౌన్): జాతీయ బ్యాంకుల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి వారానికి ఐదు రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో బ్యాంకు ఉద్యోగులు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. స్థానిక ఆర్‌ఆర్ పేటలోని యూనియన్ బ్యాంక్ నుంచి నరసింహారావుపేటలోని ఎస్‌బీఐ వరకూ ర్యాలీ చేశారు. ఏలూరు జిల్లా కన్వీనర్ కాళే శ్రీనివాసరావు, నాయకుడు శ్రీరంగం శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు పనిభారం పెరిగిందని, హామీ మేరకు ఐదు రోజుల పని అమలు చేయాలన్నారు. వచ్చే మంగళవారం దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నట్టు చెప్పారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించగా 17,122 మంది హాజరయ్యారని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను తెలిపారు. జిల్లాలో 130 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 15,250 మంది జనరల్ విద్యార్థులకు 14,893 మంది, 2,323 మంది ఒకేషనల్ విద్యార్థులకు 2,229 మంది హాజరయ్యారు.
సచివాలయ ఉద్యోగులకు పని ఒత్తిడి


