విధుల్లో చేరరు.. బిల్లులు చేయరు
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం సర్కిల్ ట్రాన్స్‌కో డీఈ (టెక్నికల్) స్థానం ఖాళీగా ఉండటంతో తమ బిల్లులు పెండింగ్‌లో పడ్డాయని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యుత్ లైన్ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. సర్కిల్ ట్రాన్స్‌కో డీఈ (టెక్నికల్) ఇక్కడి నుంచి అనకాపల్లికి బదిలీ కాగా.. ఈ స్థానంలో పదోన్నతిపై డీఈగా శర్మను కేటాయించారు. అయితే ఆయన నరసాపురం, జగ్గంపేట డీఈ (ఆపరేషన్) పోస్టుకు ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ పదవీ బాధ్యతలు చేపట్టలేదు. దీంతో నెల రోజులుగా భీమవరం సర్కిల్‌కు టెక్నికల్ డీఈ లేరు.
అప్పులు చేసి పనులు : మోంథా తుపాను సమయంలో విద్యుత్ స్తంభాలు సరిచేయడం, వైర్లు వేయడం, దెబ్బతిన ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులు వంటి పనులను పలువురు లైన్ కాంట్రాక్టర్లు చేశారు. వీటికి సంబంధించి రూ.40 లక్షల వరకు 10 మంది కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వారిలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పనులు చేసిన వారు ఉన్నారు. అప్పులు తెచ్చి పనులు చేశామని, ఇప్పుడు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
కమీషన్లు తీసుకుని కొందరికి..
విద్యుత్ అధికారులు కొందరు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకుని రూ.కోటి బిల్లులు చేశారని, కమీ షన్లు ఇవ్వని కాంట్రాక్టర్ల బిల్లులను పక్కన పెట్టేశార నే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా బిల్లుల చె ల్లింపులో డీఈ (టెక్నికల్) క్లియర్ చేయకపోవడం, సదరు అధికారి జాయిన్ కాకపోవడం, ఇద్దరు ఉన్నతాధికారులు సమన్వయం లేకుండా పనిచేయడంపై బాధిత కాంట్రాక్టర్లు విద్యుత్ సీఎండీకి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీనిపై జీఎం అకౌంట్ అధికారి వచ్చి విచారణ చేసి నివేదికను సీఎండీకి సమర్పించారు. పదోన్నతి లభించిన సదరు అధికారి పది రోజుల్లో బదిలీ స్థానంలో విధుల్లో చేరకపోతే పదోన్నతి రద్దయ్యే అవకాశం ఉందని కాంట్రాక్టర్లు అంటున్నారు.
ప్రస్తుత ఎస్‌ఈ బదిలీ అయ్యేనా?
భీమవరం విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.ఉషారాణిని ఇక్కడ నుంచి బదిలీ చేసి పదోన్నతిపై ఎస్‌ఈగా రావడానికి ఉమ్మడి జిల్లా నుంచి ఓ అధికారి రాజకీయ ప్రయత్నాలు చే స్తున్నట్టు సమాచారం.
భీమవరం సర్కిల్ డీఈ లేక బిల్లుల నిలుపుదల
మోంథా తుపాను బిల్లుల పెండింగ్
విద్యుత్ లైన్ కాంట్రాక్టర్లకు రూ.40 లక్షల వరకూ బకాయిలు
డీఈని కేటాయించినా నెల రోజులుగా నో జాయినింగ్


