బ్లాక్‌లో రిజిస్ట్రేషన్ స్లాట్లు
తాడేపల్లిగూడెం: ఆస్తుల క్రయ విక్రయాలు, గిఫ్ట్ డీడ్‌లు, తనఖాలు, వీలునామాల రిజిస్ట్రేషన్‌కు ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవడంతో పాటు చలానా సొమ్ము చెల్లించాలి. దీని ద్వారా కేటాయించిన సమయానికి కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ తంతు పూర్తిచేసుకోవచ్చు. ఈ క్రమంలో కొందరికి స్లాటులు దొరక్కపోవడం, మరికొందరికి ఆ అవకాశం లేకపోవడం జరుగుతుంటుంది. దీంతో అత్యవసరంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని నయా గ్యాంగ్ తయారైంది. బ్లాక్‌లో స్లాట్‌లను విక్రయించే ముఠా ఒకటి తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట హల్‌చల్ చేస్తోంది. తాడేపల్లిగూడెం పరిధిలో తాడేపల్లిగూడెం, పెంటపాడులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రోజుకు గూడెం కార్యాలయానికి 78, పెంటపాడు కార్యాలయానికి 36 స్లాటులను కేటాయించారు. దందా సభ్యులు ముందుగా బినామీల పేర్లతో స్లాటులను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అవసరం ఉన్నవారు ఆన్‌లైన్‌లో చూస్తే స్లాటులు బుక్ అయిపోయినట్టు చూపిస్తోంది. దందా చేసే వ్యక్తులకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో ఫలానా స్లాట్ ఖాళీగా ఉంది, కావాల్సిన వారు సంప్రదించాలనే స మాచారాన్ని వైరల్ చేస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ అవసరమైన వారు ఆయా నంబర్లను సంప్రదించి బ్లాక్ చేసిన స్లాటుకు తమ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఇలా స్లాటు ఇచ్చినందుకు రూ.2 వేలు, చలానా సొమ్ము అదనంగా వసూలు చేస్తున్న ట్టు తెలిసింది. ఈ విధంగా దందా ముఠా రోజుకు రూ.వేలల్లో గడిస్తోంది. ఈ తంతు కొన్నిరోజుల పాటు గోప్యంగా సాగినా ఇప్పుడు బహిర్గతమైంది. దీనిపై స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖ డీఐజీకి ఫిర్యాదు చేయడానికి బాధితులు సమాయత్తమవుతున్నారు.
తాడేపల్లిగూడెంలో నయా దందా


