పొగాకు సాగులో మెలకువలు
ఈ ఏడాది పంట ఆశాజనకంగా లేదు
ఈ వారంలో క్యూరింగ్ పని చేపడతాం
తగు జాగ్రత్తలు పాటించాలి
బుట్టాయగూడెం: ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో రైతులు అత్యధికంగా పండిస్తున్న వర్జీనియా పొగాకు సాగు ఈ ఏడాది ఆశాజనకంగా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది తుపాన్లు, వాతావరణ పరిస్థితుల వల్ల పొగాకు పంటను ఆలస్యంగా వేశారు. సరైన ఎదుగుదల లేదని, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడమే కారణంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పలు గ్రామాల్లో పంట దిగుబడి స్థాయికి రావడంతో పొగాకు పంటను కొట్టి క్యూరింగ్ చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉన్న జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో రైతులు వర్జీనియా పొగాకు పంటను పండిస్తున్నారు. మూడేళ్లుగా సాగు లాభసాటిగా ఉండడంతో ఈ ఏడాది గణనీయంగా పంట సాగు, విస్తీర్ణం పెరిగినట్లు తెలుస్తుంది.
26,887 హెక్టార్లలో సాగు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో 2025–26 సంవత్సరానికి సుమారు 26,887 హెక్టార్లలో రైతులు పొగాకు పంట వేసినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. 11,885 మంది రైతులు 13,401 బేరన్‌లను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. బేరన్ రిజిస్ట్రేషన్ ప్రకారం 20,987 హెక్టార్లలో పంట సాగు చేయాల్సి ఉండగా రైతులు అదనంగా 6 వేల హెక్టార్లకు పైగా రైతులు పంట వేసినట్లు అధికారులు చెప్పారు. 2025–26 పంట కాలానికి సంబంధించి 45.81 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతులు ఇచ్చినట్లు అధికారులు చెప్పారు.
మెలకువలతోనే అధిక దిగుబడులు
పొగాకు సాగులో తగిన సూచనలు పాటిస్తేనే పొగాకు దిగుబడులు అధికంగా రావడంతోపాటు సరైన మార్కెట్ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా పొగాకు క్యూరింగ్ దశలో ఉంది. పలు చోట్ల క్యూరింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సమయంలోనే తగిన మెలకువలు పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. పక్వానికి వచ్చిన ఆకును మాత్రమే క్యూరింగ్ చేయాలని సూచిస్తున్నారు. అలాగే క్యూరింగ్, గ్రేడింగ్ సమయాల్లో పొగాకులో అన్యపదార్థాలు కలవకుండా జాగ్రత్తలు పాటించాలని బోర్డు అధికారులు కోరుతున్నారు.
ఈ ఏడాది 45.81 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి
ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో పెరిగిన పొగాకు సాగు
గిరిజన ప్రాంతంలో ప్రారంభమైన క్యూరింగ్ పనులు
ఈ ఏడాది పొగాకు పంట ఆశాజనకంగా లేదు. వాతావరణంలోని మార్పులు, పొగమంచు అధికంగా కురవడం వల్ల తెగుళ్లు కూడా కనిపిస్తున్నాయి. పంట చూస్తే మాకే బాధగా ఉంది. దిగుబడి తగ్గుతుందని భయంగా ఉంది.
– సయ్యద్ బాజీ, వర్జీనియా రైతు, అచ్చియ్యపాలెం, బుట్టాయగూడెం మండలం
నేను వేసిన పంట ప్రస్తుతం రెల్పుదశకు వచ్చింది. ఈ వారంలో పంట రెల్చి క్యూరింగ్ పనులు చేపడతాం. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దిగుబడి తగ్గుతుందనే అనుమానం ఉంది.
– కలగర నాని, పొగాకు రైతు, కొమ్ముగూడెం, బుట్టాయగూడెం మండలం
పొగాకు బోర్డు అధికారుల సూచనల మేరకు రైతులు సాగు చేస్తే ఎంతో మేలు. పొగాకులో అన్యపదార్థాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలి. క్యూరింగ్ సమయంలో మెలకువలు పాటిస్తే అగ్ని ప్రమాదాలు నివారించవచ్చు.
– బి.శ్రీహరి, వేలం సూపరింటెండెంట్, జంగారెడ్డిగూడెం కేంద్రం 1
పొగాకు సాగులో మెలకువలు
పొగాకు సాగులో మెలకువలు
పొగాకు సాగులో మెలకువలు
పొగాకు సాగులో మెలకువలు


