సీరియల్ కిల్లర్ సింహాద్రికి జీవిత ఖైదు
సంచలన కేసులో న్యాయమూర్తి తీర్పు
ప్రసాదంలో సైనేడ్ కలిపి 10 మంది హత్య
ఏలూరు టౌన్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ కేసులో న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నగరంలో ఏకంగా పది హత్యలకు పాల్పడిన కేసులో వెల్లంకి సింహాద్రి అలియాస్ శివకు న్యాయమూర్తి రెండు జీవిత ఖైదులు విధించగా... మరో నిందితుడు విజయవాడ వాంబే కాలనీకి చెందిన షేక్ అమీనుల్లా బాబు అలియస్ బాబుకు పదేళ్ళ కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు. 2019లో ఏలూరు నగరంతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా సీరియల్ కిల్లర్ కేసు ఉలిక్కిపడేలా చేసింది. సింహాద్రికి మరో పదేళ్ళ కఠిన కారాగార శిక్ష , రూ.6 వేల జరిమానా విధించారు. జిల్లా ప్రతాప్ శివకిషోర్ శుక్రవారం వివరాలు వెల్లడించారు.
ప్రసాదాల్లో సైనేడ్ కలిపి హత్యలు
ఏలూరు ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్న సింహాద్రి విలాసాలకు అలవాటుపడ్డాడు. రియల్ ఎస్టేట్, రైస్ పుల్లింగ్ కాయిన్స్, రంగు రాళ్లు కొనుగోలు చేయటం, డబ్బు, బంగారాన్ని పెట్టుబడి పెడితే రెట్టింపు చేస్తానంటూ జనాలను పరిచయం చేసుకోవటం అతని ప్రత్యేకత. నమ్మకంగా వారితో ఉంటూ డబ్బులు తీసుకురమ్మని చెబుతాడు. తెచ్చిన అనంతరం విజయవాడ వాంబే కాలనీకి చెందిన షేక్ అమీనుల్లా బాబు వద్ద సైనేడ్ కొని.. భక్తి ముసుగులో ప్రసాదాల్లో కలిపి ఇస్తాడు. ప్రసాదం తిన్న అనంతరం వారు మృతి చెందేవారు. వారి వద్ద బంగారం, డబ్బు తీసుకుని మెల్లగా జారుకునేవాడు. 2019లో ఏలూరు మాదేపల్లికి చెందిన పీఈటీ మాస్టర్ కాటి నాగరాజుతో సింహాద్రి పరిచయం పెంచుకున్నాడు. రైస్ పుల్లింగ్ కాయిన్స్ కొనుగోలు చేయిస్తానని, అధిక లాభాలు వస్తాయంటూ ఆశ చూపించాడు. డబ్బు తీసుకుని సత్రంపాడు రమ్మని చెప్పాడు. సీఆర్‌ఆర్ పాలిటెక్నిక్ కాలేజీ వైపు తీసుకువెళ్ళి అతనికి జెరూసలెం నుంచి ప్రసాదం తెచ్చానని చెప్పి, సైనేడ్ కలిపిన ప్రసాదం ఇచ్చాడు. ప్రసాదం తిన్న నాగరాజు కొంతసేపటికి అక్కడే రోడ్డుపక్కన పడిపోయాడు. అతని వద్ద రూ.2 లక్షల నగదు, 5 కాసుల బంగారు వస్తువులు చోరీ చేసి జారుకున్నాడు. మృతుడి బంధువులకు అనుమానం రావటంతో త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో విస్తుబోయే హత్యలు
వెల్లంకి సింహాద్రి, షేక్ అమీనుల్లా బేగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుబోయే నిజాలు వెల్లడయ్యాయి. ప్రసాదాల్లో సైనేడ్ కలిపి ఏకంగా 10 మందిని హత్య చేసినట్లు సింహాద్రి ఒప్పుకున్నాడు. నగరంలో మూలికే రాములమ్మ, కాటి నాగరాజు, చోడవరపు సూర్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో ఉంటున్న సమంతకుర్తి నాగమణి, రాజమండ్రికి చెందిన కొత్తపల్లి రాఘవమ్మ, రామకృష్ణనంద స్వామీజీ, నూజవీడుకు చెందిన వల్లభనేని ఉమామహేశ్వరరావు, పులపర్తి తవిటయ్య, గన్నవరానికి చెందిన కడియాల బాల వెంకటేశ్వరరావు, ఆగిరిపల్లికి చెందిన గండికోట వెంకటభాస్కరరావును.. సైనేడ్‌తో చంపేశాడు.


