గణతంత్ర వేడుకలకు ఆహ్వానం
కొయ్యలగూడెం: భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం (ఆరిపాటి) గ్రామానికి చెందిన తోట కృపామణికి దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్ అఫీషియల్ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం కృపామణి ఆంధ్ర ప్రదేశ్ సీ్త్ర నిధి బ్యాంక్ డైరెక్టర్‌గా, ఏలూరు జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కనకాద్రిపురంలో ఆమె తయారు చేస్తున్న చిరుధాన్యాల ఉత్పత్తులకుగాను గ్రామం పేరు ప్రపంచ ఫుడ్ ఫెస్టివల్‌లో మార్మోగింది. అంతేగాక నాబార్డు ద్వారా ఉత్తమ మహిళా ఎంటర్‌ప్రిన్యూర్ అవార్డు అందుకున్న కృపామణిని గతేడాది కలెక్టర్ వెట్రీ సెల్వి జిల్లా తరుపున సత్కరించారు.
యలమంచిలి: అధికంగా మద్యం సేవించి రోడ్డుపై పడిపోయిన వ్యక్తి గాయాలతో ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందాడు. ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బూరుగుపల్లి గ్రామానికి చెందిన అంజూరి శ్రీను (45) ఈ నెల 20వ తేదీ రాత్రి అధికంగా మద్యం సేవించి బూరుగుపల్లి బస్టాండ్ సెంటర్లో పడిపోయాడు. అతను సిమెంట్ బల్లపై పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. అతడికి బుధవారం దొడ్డిపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. శ్రీను మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై గుర్రయ్య తెలిపారు. శ్రీను భార్య గంగావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
వీరవాసరం: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో రెండిళ్లు దగ్ధమైన ఘటన వీరవాసరం మండలం మత్స్యపురిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్యపురి గ్రామంలోని 14వ వార్డులో గండి రత్నరాజు, తోకలపూడి కృష్ణకుమారిలకు చెందిన ఇళ్లు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో గురువారం పూర్తిగా కాలిపోయాయి. ఇంట్లోని మొత్తం సామాన్లు, పిల్లల చదువుల సర్టిఫికెట్లు, వంట సామాగ్రి, దుస్తులు మొత్తం కాలిపోయి బాధితులు నిరాశ్రయులయ్యారు. సుమారుగా రూ.10 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
రాజోలు: రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన షేక్ మస్తాన్ (45) మృతి చెందాడు. ఈ నెల 21న రాజోలు మండలం పాలగుమ్మి బైపాస్ రోడ్డులో నగరం వైపు సైకిల్‌పై వెళ్తున్న షేక్ మస్తాన్‌ను గుర్తు తెలియని మోటార్ సైకిల్ బలంగా ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో 108 అంబులెన్స్‌లో రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మస్తాన్ గురువారం మృతి చెందాడని ఎస్సై రాజేష్‌కుమార్ తెలిపారు. ఊరూరా సైకిల్‌పై తిరుగుతూ గ్యాస్ స్టౌలు రిపేర్ చేస్తూ కుంటుంబాన్ని పోషించుకునే వాడని మస్తాన్ సోదరుడు నన్నాషా తెలిపారు. నన్నాషా ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు.
భీమవరం: మహాత్మాగాంధీ వర్థంతిని పురస్కరించుకుని సర్వోదయ మండలి ఆధ్వర్యంలో సర్వోదయమే గాంధేయం అనే అంశంపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాస్థాయిలో నిర్వహించిన సీనియర్ రచయితల కవితా రచనల పోటీల్లో విజేతల వివరాలను సర్వోదయ మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు గురువారం తెలిపారు. పోటీల్లో 17 రచనలు ఉత్తమ రచనలుగా ఎంపికయ్యాయన్నారు. విజేతలుగా వీఎస్‌వీ ప్రసాద్ (తణుకు), పి నాగరాజు (జీలకర్రగూడెం), టి లక్ష్మీనర్సింహమూర్తి (పాలకోడేరు), ఎం సూర్యనారాయణ (పెనుమదం), వై పాండురంగాచార్యులు (గణపవరం), కె గోపాలశర్మ (భీమవరం), బి జ్ఞానప్రసాద్ (తాడేపల్లిగూడెం), జీఆర్‌కే రాజువంశీ (భీమవరం), కె రామప్రసాద్ (పాలంగి), డీవీ బాలసుబ్రహ్మణ్యం (ఉండి), కె సుబ్రహ్మణ్యశర్మ (గునుపూడి), ఎల్‌ఎన్ శశికళ (అజ్జమూరు), కె కుషాలివెంకట్ (బొర్రంపాలెం), సీహెచ్ లక్ష్మీనారాయణ (భీమవరం), జి శేషేంద్రరావు (అత్తిలి), డి శ్రీరామకృష్ణంరాజు (తాడేపల్లిగూడెం), వి శ్రీనివాస్ (పెదతాడేపల్లి) నిలిచారన్నారు. వీరికి ఈనెల 30వ తేదీన పెదనిండ్రకొలను మహాత్మాగాంధీ భవనంలో కవితా పురస్కారాలు, బహుమతులు అందజేస్తామని ప్రసాదరాజు తెలిపారు.
గణతంత్ర వేడుకలకు ఆహ్వానం
గణతంత్ర వేడుకలకు ఆహ్వానం


