వరిసాగులో ఎరువుల యాజమాన్యం కీలకం
అత్తిలి: వరిసాగులో ఎరువుల వినియోగంపై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో ఎడాపెడా ఎరువులను చల్లి ఆర్థికంగా, దిగుబడి పరంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో వరిసాగులో ఎరువుల యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు పాటిస్తేనే అధిక దిగుబడులు సాధ్యమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వరిసాగులో ఎరువుల యాజమాన్యంపై వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ పలు సూచనలు చేశారు. నీటి యాజమాన్యంతో పాటు రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగంలోనూ వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. భూసార ఫలితాలకు అనుగుణంగా ఎరువులను వాడినప్పుడే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. భూసార పరీక్షలు చేయించనప్పుడు ఎకరాకు 25 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 నుంచి 16 కిలోల పొటాష్ లభించే ఎరువులను మాత్రమే వాడాలని, అంతకు మించి వాడితే పొలంపై తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
మూడు విడతలుగా యూరియా చల్లుకోవాలి
వరిపైరు పెరిగేందుకు నత్రజని ఎంతగానో దోహదపడుతుంది. దీనిని మూడు దఫాలుగా పొలంలో చల్లుకోవాలి. నాట్లు వేసే ముందు, దుబ్బు చేసే దశలో, అంకురం ఏర్పడే దశలో నత్రజనిని అందించే ఎరువులను వాడుకోవాలి. నత్రజని పోషకాన్ని సరైన మోతాదులో అందించేందుకు యూరియా వాడే విధానంపై రైతులు అవగాహన పెంచుకోవాలి. ఎకరానికి 25 నుంచి 32 కిలోల నత్రజని అందించాలంటే 55 నుంచి 70 కిలోల యూరియాను పొలంలో చల్లుకోవాలి. పైరు పెరుగుదల ఆశించిన రీతిలో లేకుంటే అదనంగా 10 నుంచి 15 కిలోల వరకు యూరియా వాడవచ్చు. యూరియా ఎక్కువైతే వరిమొక్కల ఆకుల్లో పత్రహరితం అధికంగా ఉంటుంది. ఫలితంగా పురుగులు దాడిచేస్తాయి. అగ్గితెగులు, ఆకుముడత తెగులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
భాస్వరం సకాలంలో అందించాలి
మొక్కల వేరుల పెరుగుదలకు పోషక పదార్థంగా భాస్వరం ఉపయోగపడుతుంది. దీనిని నాట్లు వేసే ముందు దమ్ములో లేదా నాట్లు వేసిన 15 రోజుల లోపు కాంప్లెక్స్ ఎరువుగా వాడాల్సి ఉంటుంది. ఈ ఎరువును సకాలంలో పైరుకు అందిస్తేనే మొక్కల ఎదుగుదల, దిగుబడులు బాగుంటాయి.
పొటాష్‌తో రోగ నిరోధక శక్తి
వరిమొక్కల్లో రోగ నిరోధక శక్తి పెంచడానికి అవసరమైన పోషకాలను మొక్కల్లోని వివిధ భాగాలకు సరఫరా చేయడానికి పొటాష్ ఉపయోగపడుతుంది. వరి పంటకు అవసరమయ్యే 12 నుంచి 16 కిలోల పొటాష్ అందించేందుకు 20 నుంచి 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను పొలంలో చల్లుకోవాలి. దీనిని రెండు సమభాగాలుగా చేసి మొదటి దఫా, రెండో దఫా యూరియాతో కలిపి వేస్తే ఆశించిన దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ తెలిపారు.
టీకే రాజేష్, మండల వ్యవసాయశాఖ అధికారి
వరిసాగులో ఎరువుల యాజమాన్యం కీలకం
వరిసాగులో ఎరువుల యాజమాన్యం కీలకం


