సైబర్ నేరగాళ్ల అరెస్ట్
ఆకివీడు: సైబర్ నేరగాళ్ల ముఠాలోని నలుగుర్ని పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి కోర్టుకు హాజరపర్చారు. ఆకివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ బీ.భీమారావు శనివారం వివరాలు వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు ఆకివీడుకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు కాకర్ల రాజరాజేశ్వరిని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి, ఆమె బ్యాంక్ ఖాతాల నుంచి దపదపాలుగా సుమారు రూ.93 లక్షలు కాజేశారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నాలుగు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. ఆకివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జగదీశ్వరరావు నాయకత్వంలోని బృందం బ్యాంక్ లావాదేవీలను విశ్లేషించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించింది. నిందితులు తమ బ్యాంక్ ఖాతాలను మనీ మ్యూల్ అకౌంట్లుగా ఉపయోగించారని అదనపు ఎస్‌పీ తెలిపారు. సైబర్ నేరగాళ్ల బృందంలో మొదటి స్టెప్‌లో పనిచేస్తున్న వ్యక్తులు నలుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు. విశాఖపట్నం మధురవాడకు చెందిన జబ్బి జగదీష్ రెడ్డి ఖాతాకు రూ.5 లక్షలు జమ చేయగా, మహారాష్ట్రలోని ముంబాయి ప్రాంతంలోని గాడి అడ్డ కు చెందిన ఆరీఫ్ మహ్మద్ ఖాతాకు రూ.5 లక్షలు, హైదరాబాద్ దిల్‌షుక్ నగర్‌కు చెందిన పూసునూరి రాధారాణి ఖాతాకు రూ.11 లక్షలు, మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా, రామానంద్ నగర్‌కు చెందిన షాహిద్ లతీఫ్ షేక్ ఖాతాకు రూ.10 లక్షలు బదిలీ కావడంతో వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆయా ఖాతాల్లో ఉన్న సొమ్ము రూ. 7,34,240 రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా సీఐ జగదీశ్వరరావు, ఎస్సై హనుమంతు నాగరాజు, భీమవరం వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం.నాగరాజు, ఉండి ఎస్సై ఎండీ.నజీరుల్లా, కాళ్ల ఎస్సై ఎన్.శ్రీనివాసరావు, భీమవరం టౌన్ ఎస్సై వంశీ, రెహ్మన్, వీర్రాజు, కానిస్టేబుళ్లను అభినందించారు.


