శ్రీవారి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల: శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా, జై భవానీ.. జైజై భవానీ నామస్మరణలతో చిన్నతిరుపతి క్షేత్రం శనివారం మార్మోగింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు క్షేత్రానికి విచ్చేశారు. అలాగే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న చంఢీ హోమంలో పాల్గొని, ఇరుముడులు సమర్పించి, దీక్షలు విరమించిన భవానీ మాలదారులు పెద్ద ఎత్తున తిరుగు ప్రయాణంలో ద్వారకాతిరుమలకు చేరుకున్నారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులు, భవానీ దీక్షాదారులతో కళకళలాడాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అనివేటి మండపం, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనార్థం భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని వేదికపై అమలాపురంనకు చెందిన గోకవరపు సూర్యకిరణ్ సతీమణి సులేఖ, భగవద్వాణి శిష్య బృందం చేసిన భగవద్గీత పారాయణతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.


