జాడలేని అప్రోచ్ రోడ్లు
● గత ప్రభుత్వంలో రూ.36 కోట్ల మంజూరు
● ఎన్నికల కోడ్‌తో నిలిచిన టెండర్లు
● చంద్రబాబు ప్రభుత్వంలో అటకెక్కిన వైనం
● కేంద్ర మంత్రి ఉన్నా ఫలితం శూన్యం
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని యనమదుర్రు డ్రెయిన్‌పై నిర్మించిన వంతెనలు అప్రోచ్ రోడ్లు లేక నిరుపయోగంగా మారాయి. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో (2004 నుంచి 2009 వరకు) డెల్టా ఆధునికీకరణలో భాగంగా భీమవరంలో చేపల మార్కెట్, భీమవరం మండలంలోని గొల్లవానితిప్ప, తోకతిప్ప ప్రాంతాల్లో వంతెనలు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తిచేశారు. ఆయన అకాల మరణంతో వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. అనంతరం వచ్చిన పాలకులు వీటిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్రోచ్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అయితే ఎన్నికల కోడ్‌తో టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అప్రోచ్‌లపై దృష్టి సారించకపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.
గత ప్రభుత్వంలో రూ.36 కోట్లు
జిల్లాలో తీర, భీమవరం ప్రాంతాల ప్రజల ఇబ్బందుల దృష్ట్యా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.36 కోట్లు మంజూరు చేసింది. తొలుత ప్రాథమిక అంచనాల ప్రకారం మాజీ సీఎం జగన్ రూ.15.30 కోట్లను మంజూరు చేశారు. డిజైన్లను పూర్తి చేసి శాశ్వత ప్రాతిపదికన అప్రోచ్‌ల నిర్మాణానికి సిద్ధమవుతున్న తరుణంలో డిజైన్లను మార్పు చేయాల్సి వచ్చింది. దీంతో కొత్త డిజైన్‌లతో అప్రోచ్‌లను నిర్మించాలని మరోసారి జగన్‌కి వివరించగా ఆయన రూ.36 కోట్లు నిధులను మంజూరు చేశారు. ఆర్‌అండ్‌బీ అధికారులు పరిశీలించి పంపించిన డిజైన్లను గత ప్రభుత్వం ఖరారు చేసి పనులకు టెండర్లు కూడా పిలిచింది. అయితే ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఎన్నికల కోడ్ రావడంతో టెండర్లు నిలిపోయాయి. నిధులు నిర్మాణం కోసం అలాగే ఉండిపోయాయి.
17 నెలలుగా ప్రస్తావనే లేదు
చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కి 17 నెలలు గడుస్తున్నా వంతెనల అప్రోచ్‌ల నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. వీటి గురించి స్థానిక ప్రజాప్రతినిధి, అధికారులు ప్రస్తావించిన దాఖలాలు లేవు. నిధు లు మంజూరై నిర్మాణాలు చేపట్టకపోవడంపై సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కు ట్రలతోనే నిర్మాణాలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
కేంద్ర మంత్రి ఉన్నా..
నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాజ్యసభ ఎంపీ పాకా సత్యనారాయణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఈ ప్రాంతానికి చెందిన వారైనా అప్రోచ్‌ల నిర్మాణాలు అడుగు ముందుకు పడటం లేదు. కూ టమి నాయకులు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం తప్ప మంజూరైన రూ.36 కోట్ల నిధుల వినియోగంపై దృష్టి పెట్టడం లేదనే వి మర్శలు ఉన్నాయి. ప్రభుత్వం, అధికారులు అప్రోచ్‌లపై నిర్లక్ష్యం వీడి పనులు త్వరితగతిన చేపట్టాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.


