రాగి వైర్లు చోరీ చేసే ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

రాగి వైర్లు చోరీ చేసే ముఠా అరెస్టు

Nov 28 2025 7:09 AM | Updated on Nov 28 2025 7:09 AM

రాగి వైర్లు చోరీ చేసే ముఠా అరెస్టు

రాగి వైర్లు చోరీ చేసే ముఠా అరెస్టు

జంగారెడ్డిగూడెం: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లలో రాగి వైరు చోరీ చేసే ముఠాలో ఒక వ్యక్తి విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందడంతో ముఠా మొత్తం గుట్టురట్టయ్యింది. ఈ ఘటనకు సంబంధించి జంగారెడ్డిగూడెం సర్కిల్‌ కార్యాలయంలో గురువారం ఏఎస్పీ సుస్మిత రామనాథన్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం పాల్వంచ, మణుగూరు, పరకాల ప్రాంతాలకు చెందిన కెల్లా దుర్గాప్రసాద్‌, షేక్‌ హైమత్‌, దేవకోటి రాజేష్‌, కండెల జ్యోతి, కూరాకుల పద్మ, కోరగట్టు నాగరాజు ఒక ముఠాగా ఏర్పడి ఆంధ్రా ప్రాంతానికి వచ్చి ట్రాన్స్‌ఫార్మర్‌లలో రాగి వైరు చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24న రాత్రి తడికలపూడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రావికంపాడు గ్రామ శివారులో ఉన్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు సంబంధించిన ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగివైరు దొంగిలించడానికి రెండు కార్లలో వచ్చారు. దొంగతనం చేసే క్రమంలో ముఠాలోని సభ్యుడైన కోరగట్టు నాగరాజు ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కాడు. అయితే వైర్లను తప్పించే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో ముఠా సభ్యులు నాగరాజును జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ముఠాలోని ఐదుగురు సభ్యులు పారిపోయి మృతుడు నాగరాజు బావ అయిన పాల్వంచ మండలం కొత్తసూరారం గ్రామానికి చెందిన చాపా రాములుకు సమాచారం ఇచ్చారు. అతను వచ్చి నాగరాజు మృతదేహం చూసి తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో తడికలపూడి ఎస్సై పి.చెన్నారావు కేసు నమోదు చేసి, సీఐ ఎంవీ సుభాష్‌ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులకు అందిన సమాచారం మేరకు రావికంపాడు బస్‌స్టాప్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా రెండు కార్లలో వెళుతున్న కెల్లా దుర్గాప్రసాద్‌, షేక్‌ హైమత్‌, దేవకోటి రాజేష్‌, కండెల జ్యోతి, కూరాకుల పద్మను గుర్తించి అరెస్టు చేశారు. కాగా నిందితుల్లో కెల్లా దుర్గాప్రసాద్‌పై తెలంగాణ రాష్ట్రం పాల్వంచ, ఎడుల్ల బయ్యారం పోలీస్‌స్టేషన్‌లలో 13 కేసులు ఉండగా, కండెల జ్యోతి, కూరాకుల పద్మలపై మెదక్‌లో ఒక కేసు ఉంది. నిందితులను కోర్టులో హాజరు పరిచనున్నట్లు తెలిపారు. అలాగే నిందితులు వినియోగించిన రెండు కార్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లలో రాగి వైరు చోరీ చేసేందుకు వినియోగించే పరిరకాలు, ఐదు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్టు చేయడంలో కృషిచేసిన తడికలపూడి ఎస్సై పి.చెన్నారావు, జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌, ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్‌, జంగారెడ్డిగూడెం పీసీలు ఎన్‌.రమేష్‌, ఎస్‌కే షాన్‌బాబులకు రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేసినట్లు తెలిపారు.

ముఠా సభ్యుడి మృతితో గుట్టురట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement