కాటన్ లోడు లారీ దగ్ధం
తణుకు అర్బన్: పట్టణ పరిధిలో కాటన్ లోడుతో ఉన్న లారీలో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. స్థానిక సత్యవాడ రోడ్డులోని గౌతమి సాల్వెంట్ ప్రాంతంలో కర్మాగారం నుంచి బయటకు వచ్చిన లారీలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో లారీని రోడ్డుపైనే నిలిపివేశారు. లారీలో ఉన్న కాటన్ దగ్ధమైపోతుండడంతో స్థానికులు లారీ నుంచి కొంత కాటన్‌ను బయటకు లాగారు. దీంతో రోడ్డు పొడవునా మండుతున్న కాటన్‌తో రహదారి అంతా నిప్పులగుండంగా మారిపోయింది. ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలోని స్పిన్నింగ్ మిల్లు నుంచి కాటన్‌లోడు గుంటూరుకు వెళ్లే క్రమంలో తణుకు గౌతమి సాల్వెంట్‌లోని లారీ కాటా వేయించుకునేందుకు వచ్చినట్లుగా లారీ డ్రైవర్ చెబుతున్నారు. లారీలో 71 బేళ్లు (సుమారుగా 6వేల కిలోలు) కాటన్ ఉన్నట్లుగా చెప్పారు. మంటలు చెలరేగడానికి కారణం మాత్రం తెలియరాలేదు. లారీలోంచి పూర్తిస్థాయిలో కాటన్‌ను తొలగించలేకపోవడంతో లారీకి సైతం మంటలు అంటుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
విద్యుదాఘాతంతో ట్రాక్టర్‌పై గడ్డి దగ్ధం
యలమంచిలి : మేడపాడు–నేరేడుమిల్లి రోడ్డులో గడ్డి లోడుతో వస్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగలడంతో గడ్డి దగ్ధమైంది. మండలంలోని ఆర్యపేట గ్రామానికి చెందిన పాడి రైతు చీకట్ల ప్రకాష్ పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలో ఎండు గడ్డి కొనుగోలు చేశారు. ఆ గడ్డిని గురువారం ఆలమూరు గ్రామానికి చెందిన కటికితల విజయ్‌కుమార్‌కు చెందిన ట్రాక్టర్‌లో ఎగుమతి చేసుకుని ఆర్యపేట వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న రైతులు బకెట్‌లతో నీరు తీసుకుని ఆర్పుతూ ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేశారు. ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే గడ్డి కట్టలుగా ఉండడంతో ట్రాక్టర్ ట్రక్ ఆహుతవ్వలేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 వేలు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు.


