ఉత్సాహంగా అంతర్ కళాశాలల వాలీబాల్ పోటీలు
దెందులూరు: పోటీతత్వం పట్టుదల నిరంతర సాధన ఈ రంగంలోనైనా విజయాన్ని తెచ్చిపెడుతుందని ఏలూరు జిల్లా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మహమ్మద్ అజీజ్, దెందులూరు తహసీల్దార్ బీ.సుమతి అన్నారు. గురువారం గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాలలో రెండు రోజుల అంతర్ కళాశాలల వాలీబాల్ మహిళల పోటీలు ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతానియేలు మాట్లాడుతూ రెండు రోజుల వాలీబాల్ మహిళల పోటీల్లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఐదు జిల్లాల్లో 14 కళాశాల నుంచి మహిళలు హాజరయ్యారన్నారు. ఈ పోటీల్లో యూనివర్సిటీ టీంను ఎంపిక చేశారన్నారు. ఈ పోటీల్లో సెయింట్ థెరిస్సా కాలేజీ ఏలూరు ప్రథమ స్థానం, ప్రభుత్వ కళాశాల రంపచోడవరం ద్వితీయ స్థానం, సీఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ జట్టు తృతీయ స్థానం సాధించాయన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పోలిరెడ్డి విజేతలకు షీల్డ్స్, సర్టిఫికెట్లు అందజేశారు.


