అంతరాలయ దర్శనం..నయనానందకరం
రూ.500 టికెట్లతో ఫిల్టర్
దర్శనం సంతృప్తినిచ్చింది
పెద్ద తేడా లేదు
● ఐదేళ్ల తరువాత
తొలిసారిగా అందుబాటులోకి..
● సంతోషం వ్యక్తం చేస్తున్న శ్రీవారి భక్తులు
ద్వారకాతిరుమల: ఆపదమొక్కులవాడు ఆ వేంకటేశ్వరుడిని కనులారా వీక్షించిన వారిది కదా భాగ్యము.. దగ్గర నుంచి దర్శించిన వారిది కదా జన్మ ధన్యము. ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలో శ్రీవారి అంతరాలయ దర్శనం, అమ్మవార్ల ముందు నుంచి సాధారణ (దగ్గర) దర్శనాన్ని ఆలయ అధికారులు గురువారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దగ్గర నుంచి దర్శించుకున్న భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. ఐదేళ్ల తరువాత మళ్లీ స్వామి వారిని దగ్గర నుంచి దర్శించుకునే వీలు కలిగిందని భక్తజనం సంతోషపడ్డారు. అలాగే బుధవారం రాత్రి వివిధ ప్రాంతాల్లో వివాహాలు జరుపుకున్నవారు గురువారం ఉదయం ఆలయానికి వచ్చి, స్వామివారి దర్శనం చేసుకుని సంబరపడ్డారు. ఇదిలా ఉంటే అంతరాలయ దర్శనం చేసుకోవాలన్న కోరిక ఉన్న వారు ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులు, దళారుల ప్రమేయం లేకుండా దర్జాగా రూ.500 టికెట్లు తీసుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. తొలిరోజు 610 మంది భక్తులు రూ.500 టికెట్లను కొనుగోలు చేయడం ద్వారా శ్రీవారికి రూ.3,05,000ల ఆదాయం సమకూరింది.
సాధారణ దర్శనం వైపే మొగ్గు
అంతరాలయ దర్శనానికి, అమ్మవార్ల ముందు నుంచి చేసుకునే సాధారణ దర్శనానికి మధ్య ఒక గుమ్మం మాత్రమే ఉంటుంది. దాంతో ఈ రెండింటికి పెద్ద తేడా లేకపోవడంతో ఒక్కొక్కరికి రూ.500 ఖర్చు చేయడం ఎందుకు? అని భావించిన కొందరు భక్తులు సాధారణ దర్శనం చేసుకున్నారు. స్వామి, అమ్మవార్లు అందరికీ దగ్గర నుంచే కనిపిస్తున్నారు. గతంలో బయట నుంచి దర్శనం చేసుకునేటప్పుడు పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లలో కేవలం పద్మావతి అమ్మవారి దర్శనం మాత్రమే అయ్యేది. వృద్ధులకు, కంటి సమస్య ఉన్న వారికి స్వామి వారి దర్శనం కూడా సరిగ్గా అయ్యేది కాదు.
తూర్పు గుమ్మం వద్దే సమస్య
ఉచిత దర్శనం, అలాగే రూ. 100, రూ. 200, రూ. 500 ల టికెట్‌లు పొందిన భక్తులు, నిత్యకల్యాణం, అష్టోత్తరం జరిపించుకున్న వారు తూర్పు గుమ్మం మీదుగా ఆలయంలోకి వెళుతున్నారు. ఐదు క్యూలైన్ల భక్తులు ఒకే గుమ్మం, అది కూడా ఇరుకుగా ఉన్న దాంట్లోంచి ఒకేసారి లోపలికి వెళ్లడం కాస్త ఇబ్బందిగా ఉంది. అందుకే శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో అంతరాలయం, లోపలి నుంచి సాధారణ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు అధికారులు ముందే ప్రకటించారు.
ఆలయం లోపల ఇరుకుగా ఉండటం వల్ల ఎక్కువ మంది భక్తులు అంతరాలయ దర్శనం చేసుకునే వీలు ఉండడం లేదు. ఈ క్రమంలోనే అధికారులు అంతరాలయ దర్శనం టికెట్ రుసుమును రూ.500గా నిర్ణయించడంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. టికెట్ ధర తక్కువ ఉంటే రద్దీ పెరిగి, సమస్య తలెత్తేది. అధిక ధర కావడంతో అంతరాలయ దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య ఫిల్టర్ అవుతోంది.
ఆలయం లోపలికి వెళ్లి శ్రీవారిని, అమ్మవార్లను దగ్గర నుంచి దర్శించుకోవడం సంతృప్తినిచ్చింది. గతేడాది ఆలయానికి వచ్చినప్పుడు బయట నుంచే పంపించేశారు. దేవుడు కూడా సరిగ్గా కనిపించలేదు. అసలు ఆలయానికి ఎందుకొచ్చానో?తెలియలేదు. కానీ ఈసారి స్వామి, అమ్మవార్లను దగ్గర నుంచి దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను.
– పాలవ ఆంజనేయులు, భక్తుడు, చెక్కపల్లి, ముసునూరు మండలం
శ్రీ వారి అంతరాలయ దర్శనానికి, సాధారణ దర్శనానికి పెద్ద తేడా కనబడలేదు. కేవలం ఒక గుమ్మం మాత్రమే అడ్డుగా ఉంది. చెక్కల ర్యాంపు పైనుంచి స్వామివారు స్పష్టంగా కనిపించారు.. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని తరించాను. మంచి దర్శన సౌకర్యాన్ని కల్పించిన ఆలయ అధికారులకు ధన్యవాదాలు.
– గొడ్ల బేబీ సరోజిని, భక్తురాలు, ఎంగండి, పామర్రు మండలం
అంతరాలయ దర్శనం..నయనానందకరం
అంతరాలయ దర్శనం..నయనానందకరం
అంతరాలయ దర్శనం..నయనానందకరం
అంతరాలయ దర్శనం..నయనానందకరం


