ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
యలమంచిలి: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రబీ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. మండలంలోని పూలపల్లిలో ఉన్న రంగరాజు రైస్ మిల్లును బుధవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తనిఖీ చేశారు. ఖరీఫ్ 2025–26 సీజన్ సంబంధించి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను రైసు మిల్ యజమానులను ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు జరిగిందో స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిల్లు వద్ద దిగుమతి చేస్తున్న వాహనాలను పరిశీలించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ వై దుర్గా కిషోర్, డీటీ నాగదేవి, రైస్ మిల్ యజమాని రంగరాజు సిబ్బంది ఉన్నారు.


