శుభకార్యాలకువిరామం
ఒక్క ముహూర్తం కూడా లేదు
ఖాళీగా ఉండాల్సిందే..
శుభ సూచికం కాదు
● రేపటి నుంచి ఫిబ్రవరి 17 వరకు ముహూర్తాలు లేవు
● శుక్ర మౌఢ్యమే కారణం
ద్వారకాతిరుమల: పెళ్లికి అతి ముఖ్యమైంది ముహూర్తం. బలమైన ముహూర్తంలో వివాహం చేసుకుంటే నూరేళ్ల జీవితం సుఖమయం అవుతుందన్నది అందరి నమ్మకం. అందుకే వివాహ తంతులో ప్రతి కార్యక్రమానికి ముహూర్తాలు చూసుకుంటాం. అందుకు పురోహితులు, పండితుల చుట్టూ తిరుగుతాం. అలాంటి ముహూర్తాలకు శుక్రవారం నుంచి బ్రేక్ పడనుంది. ఈ నెల 30న ప్రారంభమయ్యే శుక్ర మౌఢ్యమి(మూఢం), వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న మాఘ బహుళ అమావాస్య వరకు కొనసాగనుంది. అప్పటి వరకు శుభకార్యాలకు విరామం ఏర్పడుతుంది. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకుని సిద్ధంగా ఉన్న వారు మంచి ముహూర్తాల కోసం మూఢమి ముగిసే వరకు వేచి ఉండాల్సిందే. వివాహాలకు వేదికై న ద్వారకాతిరుమల శ్రీవారి దివ్య క్షేత్రంలో పెళ్లి బాజాలు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేద మంత్రాలు ఈ 80 రోజుల పాటు వినబడవు.
మాఘమాసమూ మూఢంలోనే..
మాఘమాసం ఎప్పుడొస్తుందా అని వివాహాలు చేసుకునేవారు ఆశగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆ మాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయి. అయితే ఈసారి మాఘమాసం మూఢమిలో కలవడంతో ఒక్క ముహూర్తం కూడా లేదు. అంతే కాదు.. గృహ ప్రవేశాలకు అనుకూలమైన రథసప్తమి, వసంత పంచమి, మాఘ పౌర్ణమి వంటి ముఖ్యమైన తిధులు కూడా మూఢంలో కలిసిపోయాయి.
వ్యాపారులకు గడ్డు కాలం
శుభకార్యాలకు బ్రేక్ పడనున్న ఈ 80 రోజులు వ్యాపారులకు గడ్డు కాలమనే చెప్పాలి. మండపాలు, ఫంక్షన్ హాల్స్, వస్త్ర దుకాణాలు, స్వర్ణకారులు, నగల షాపుల యజమానులు, డెకరేషన్, క్యాటరింగ్, ఫొటో, వీడియో గ్రాఫర్లు, టెంట్‌హౌస్, పూల వ్యాపారులు, ట్రావెల్స్, లైటింగ్, డిజే బాక్సులు అద్దెకిచ్చేవారు ఇలా శుభకార్యాలపై ఆధారపడ్డ అన్ని రంగాల వారు, ముఖ్యంగా పురోహితులు తీవ్రంగా నష్టపోనున్నారు.
ఈనెల 30 నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభం కానుంది. 28 ఉదయం వివాహాలకు ఒక ముహూర్తం మాత్రమే ఉంది. ఆ తరువాత నుంచి ఫ్రిబ్రవరి 17 వరకు ఒక్క ముహూర్తం కూడా లేదు. ఈసారి మాఘమాసం కూడా మూఢంలోనే కలిసిపోయింది. నిశ్చితార్ధాలు, పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు ఇతర శుభకార్యాలు జరుపుకునేవారు మూఢమి ముగిసే వరకు వేచి ఉండక తప్పదు. ఎందుకంటే ఈ 80 రోజుల్లో ఒక్క ముహూర్తం కూడా లేదు.
– గోవింద వఝుల వెంకటరమణమూర్తిశర్మ, పురోహితులు, ద్వారకాతిరుమల
పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలపై ఆధారపడ్డ వ్యాపారులమంతా మూఢమి కారణంగా 80 రోజులపాటు కాళీగా ఉండాల్సిందే. టెంట్‌హౌస్ వ్యాపారంపై ఎంతో మంది కార్మికులు ఆధారపడ్డారు. వారంతా ఇబ్బందులు పడక తప్పదు. అలాగే పచ్చిపూల మండపాలు, కేటరింగ్ వంటి వాటిపై ఆధారపడ్డ వారందరికీ కష్టాలు తప్పవు.
–ఎస్‌కే రంగావలి, టెంట్‌హౌస్ యజమాని, లక్ష్మీపురం
ఒక గ్రహం సూర్య కిరణాల్లో కనుమరుగవడాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూఢం అంటారు. గ్రహ శక్తులు బలహీనమవడంతో శుక్ర గ్రహం సూచించే ఫలితాలు అనుకూలంగా ఉండవు. శుభకార్యాలకు గురుడు ఎంత ప్రధాన కారకుడో, శుక్రుడు కూడా అంతే ప్రభావం కలవాడు. శుక్రుడు బలహీనమైతే సంబంధాలు, వివాహ జీవితం, ఆర్థిక స్థిరత్వం వంటి విషయాల్లో ప్రతికూలతలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. శుక్ర మౌఢ్యం ఉన్న కాలంలో శుభకార్యాలు జరుపుకోడం శుభ సూచకం కాదని అంటున్నారు.
శుభకార్యాలకువిరామం
శుభకార్యాలకువిరామం


