వణికిస్తున్న వాయుగండం
రైతులు అప్రమత్తంగా ఉండాలి
సార్వా కోతల చివరలోనూ రైతులకు ఇబ్బందులే
భీమవరం : వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలోని రైతులకు ప్రస్తుత సార్వా సీజన్ కలిసివచ్చినట్లు కన్పించడం లేదు. వరి ప్రారంభం నుంచి అనేక ఆటంకాలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పంట చేతికి వచ్చే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రైతన్నలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో ప్రస్తుత సార్వా సీజన్‌లో సుమారు 2.15 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. సీజన్ ప్రారంభంలో సాగునీటి కొరతతో ఇబ్బందులు పడ్డ రైతులు ఎరువుల కొరత, ఎలుకల బెడద వంటి సమస్యలను అధిగమించి పైరును పెంచి పోషించగా ముందుగా నాట్లువేసిన ఏరియాలో మాసూళ్లు, మిగిలిన ప్రాంతాల్లో ఈనిక, గింజలు గట్టిపడే దశలో ఉండగా మోంథా తుపాను అపార నష్టం కలిగించింది. జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాల్లో పంటకు నష్టం ఏర్పడినట్లు అధికారులు లెక్కలు గట్టారు. తుపాను, వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో పైరు నేలకొరిగిపోవడం, ఈనిక దశలో ఉన్న పైరుపై వర్షం పడడంతో గింజలు తప్పలుగా మారాయి. మానుపండు వంటి తెగులు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పైరు నేలనంటిన ప్రాంతాల్లో ఎకరాకు 20 బస్తాలకు మించి దిగుబడి వచ్చే అవకాశం లేదని దీంతో కనీసం పెట్టుబడులు కూడా రావని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన కలిగిస్తున్న వాతావరణం
జిల్లాలోని తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాల్లో చాలా వరకు మాసూళ్లు పూర్తికాగా మిగిలిన మండలాల్లో ఇప్పుడిప్పుడే మాసూళ్లు ఊపందుకున్నాయి. తుపాను ప్రభావంతో దిగుబడులు తగ్గుతాయని ఆందోళన చెందుతున్న రైతులకు పంట నేలకొరిగిపోవడంతో మిషన్ ద్వారా మాసూళ్లకు మరింత ఖర్చు పెరిగిందని చెబుతున్నారు. చేను నిలబడి ఉంటే గంట సమయంలో మాసూళ్లు పూర్తి అయ్యేదని, పడిపోవడంతో 2 గంటల వరకు సమయం పడుతుందని దీంతో ఖర్చు రెట్టింపు అవుతోందని చెబుతున్నారు. ఒక్కసారిగా కోతలు రావడంతో వాతావరణంలో మార్పులతో మిషన్లకు డిమాండ్ పెరిగి మరింత ఎక్కువగా వసూలు చేస్తున్నారని వాపోతున్నారు.
వాతావరణ శాఖ అంచనాలతో ఈ నెల 27 నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అకాశమున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా 29 నుంచి డిసెంబర్ 1 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున వరి కోతలు, ధాన్యం ఎండబెట్టడం, విక్రయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నరసాపురం, మొగల్తూరు, భీమవరం, పాలకొల్లు పరిసరాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అకాశమున్నందున పొలాల్లోని నీరు బయటకు వెళ్లేందుకు డ్రైనేజీ ఏర్పాటు చేసుకోవాలి. ధాన్యం వర్షానికి తడవకుండా టార్పాలిన్లు కప్పి జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు కంట్రోల్ రూమ్ నెంబర్లు 81216 76653, 1800 425 1291 నెంబర్లలో సంప్రదించాలి.
– టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్, భీమవరం
వణికిస్తున్న వాయుగండం


