అంబేడ్కర్‌కు నివాళి
తణుకు అర్బన్: భారత రాజ్యాంగం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజును ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ విగ్రహానికి కారుమూరితోపాటు పార్టీ నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి పొట్ల సురేష్, పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, తణుకు మండల మహిళాధ్యక్షురాలు ఉండవల్లి జానకి, గెల్లా జగన్, ఎస్వీ జాకబ్‌బాబు, వన్నెంరెడ్డి మురళీమోహన్, గెద్దాడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ రాయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎస్‌టీయూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సాయివర్మ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్‌వర్మకు వినతిపత్రం అందచేశారు. బుధవారం భీమవరంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందించి మాట్లాడుతూ ఉపాధ్యాయులను మానసిక ఆందోళనకు గురిచేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలని కోరారు.
భీమవరం: చినరంగనిపాలెం సెంటర్‌లో కొంతమంది విద్యార్థులు కత్తులతో బైకులపై వచ్చి అలజడి సృష్టించడం కలకలం రేపింది. ప్రైవేటు కళాశాలకు చెందిన కొంతమంది విద్యార్థినులు రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా వెనుకనుంచి ఒక యువకుడు వారిలో ఒకరిని ఢీకొట్టాడు. దీంతో వారిలో ఒక విద్యార్థిని ఢీకొట్టిన యువకుడిని కొట్టడంతో అవమానానికి గురై తన స్నేహితులకు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో కత్తులతో వచ్చిన యువకులు అసలు విషయం తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని చెబుతున్నారు. దీనిపై వన్‌టౌన్ సీఐ ఎం నాగరాజును వివరణ కోరగా గలాట జరుగుతున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బంది అక్కడికి వెళ్లారని అక్కడ ఎలాంటి గొడవ లేదని, ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.
వీరవాసరం: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్ తోలేరులో నిర్వహిస్తున్న 21వ జాతీయ స్థాయి నాటికల పోటీలు ఈనెల 27 నుంచి డిసెంబరు 1 వరకు నిర్వహిస్తున్నట్లు కళా పరిషత్ అధ్యక్షులు చవాకుల సత్యనారాయణమూర్తి బుధవారం తెలిపారు. 27న సాయంత్రం 7 గంటలకు పోటీలను ప్రారంభిస్తారని , అనంతరం పలువురు సంఘ సేవకులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు.
ఏలూరు (టూటౌన్): మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ నుంచి ద్వారకాతిరుమల మండలం హనుమాన్‌గూడెం మొక్కజొన్న విత్తన రైతులకు రూ.20 లక్షల బకాయిలు ఇప్పించి వెంటనే ఆదుకోవాలని, రైతులకు అనుకూలమైన విత్తన చట్టం తేవాలని, విత్తన కంపెనీ నుంచి రైతులకు అగ్రిమెంట్ ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం – ఆంధ్రప్రదేశ్ విత్తన రైతుల సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మొక్కజొన్న విత్తన రైతులు బుధవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. మాకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ నినాదాలు చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, మొక్కజొన్న రైతులు సీడ్ ఆర్గనైజర్ చేతిలో మోసపోయారని న్యాయం చేయాలని కోరారు.
అంబేడ్కర్‌కు నివాళి


