నాన్ లేఅవుట్‌లపై కొరడా
జనవరిలోపు ఎల్‌ఆర్‌ఎస్
గత ప్రభుత్వంలో అక్రమ లేఅవుట్లకు చెక్
భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లాలో నిబంధనలు పాటించకుండా వేసిన నాన్ లేఅవుట్‌లు, నిర్మించిన భవనాలపై లోకాయుక్తతో పాటు హైకోర్టులో పిటిషన్‌లు వేయడంతో జిల్లా పంచాయతీ అధికారులు రంగంలోకి దిగారు. నాన్ లేఅవుట్‌లు, వాటిలో నిర్మించిన భవనాలపై చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నాన్‌లేవుట్‌లు గుర్తించాలని పంచాయతీ కార్యదర్శలకు ఆదేశాలు జారీ చేశారు. గుర్తించిన నాన్ లేఅవుట్లలో బోర్డులు పెట్టాలని, నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేసిన భవనాలకు నోటీసులు జారీ చేయాలని అదేశాలు ఇవ్వడంతో పంచాయతీ కార్యదర్శులు బోర్డులు పెట్టడంతో పాటు నోటీసులు జారీ చేస్తున్నారు.
500 ఎకరాల్లో నాన్ లేఅవుట్‌లు
జిల్లాలో 20 మండలాలు, 409 గ్రామ పంచాయతీలున్నాయి. వాటిలో 800 వరకు నాన్ లేఅవుట్‌లు ఉన్నాయి. 500 ఎకరాల్లో నిబంధనలకు పాటించకుండా అక్రమ లేఅవుట్ చేసి వ్యాపారాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు కలిసి నాన్ లేఅవుట్లు వేసి స్థలాలు అమ్మేశారు.
అక్రమ లేవుట్లు వేసి పంచాయతీ, రెవెన్యూ శాఖకు ఫీజులకు ఎగనామం పెట్టారు. దాంతో రూ.కోట్లల్లో ఆదాయం కోల్పోయారు.
టీడీపీ పాలనలో విచ్చలవిడిగా..
2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో గ్రామాల్లో అధికంగా సంఖ్యలో నాన్ లేఅవుట్లు వేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు నిబంధనలు పాటించకుండా, పంచాయతీల అనుమతుల లేకుండా ఫీజలు చెల్లించకుండా వందల ఎకరాలను రియల్ ఎస్టేట్‌గా చేసి వ్యాపారం చేసుకున్నారు. వీరవాసరం మండలం నవుడూరులో కొందరు టీడీపీ నాయకులు నిబంధనలు పాటించకుండా నాన్ లేవుట్ వేయడంపై కొందరు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వంలోనే నిబంధనలు ఉల్లంగించారు.
గ్రామ కార్యదర్శుల హస్తం
కొందరు రియల్ వ్యాపారాలు అధికార పార్టీ అండతో గ్రామ పంచాయతీల్లో పచ్చని భూములను నిబంధనలు పాటించకుండా, ప్రభుత్వానికి ఫీజలు కట్టి అనుమతులు తీసుకోకుండా ప్లాట్‌లుగా మార్చేశారు. ఉండాల్సినన కొలతల ప్రకారం రోడ్లు, డ్రెయిన్లు లేకుండా స్థలాలు పూడ్చి అమ్మేశారు. నాన్ లేఅవుట్లలో స్థలాలు కొని మోసపోతున్నారు. నాన్ లేఅవుట్‌లో స్థలాలు తీసుకుంటే పంచాయతీ నీళ్లు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించదు. తక్కువ ధరకు స్థలం వస్తుందని కొనుగోలు చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ చేసుకోవాలని అధికారులు చెప్పడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోతున్నారు. గ్రామ పంచాయతీలల్లో అనధికార లేఅవుట్ వేయడంలో కొందరు పంచాయతీ సెక్రటరీలు హస్తం ఉందంటున్నారు. రూ.లక్షల్లో లంచాలు తీసుకుని నిబంధనలు లేకునా పంచాయతీకి చెల్లించాల్సిన ఫీజు కట్టకపోయిన వ్యాపారం జోరుగా సాగుతుంది.
జిల్లాలోని అనధికార లేఅవుట్ల యాజమానులు లేక డెవలపర్స్ జనవరి లోపు ఎల్‌ఆర్‌ఎస్ పూర్తి చేయాలి. లేఅవుట్‌ను అన్ని అనుమతులతో క్రమబద్ధీకరించుకోవాలి. లేదంటే నాన్ లేఅవుట్లపై చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో నాన్ లేఅవుట్లను గుర్తించి వాటిలో పంచాయతీ నుంచి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. అనధికార లేఅవుట్‌లో స్థలాలు కొంటే పంచాయతీ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వరు. మంచినీటి సౌకర్యం, డ్రెయిన్ల ఏర్పాటు జరగదు.
– ఎస్.రామనాథరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి
జనవరిలోపు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకోకపోతే చర్యలు
ఆదేశాలు జారీచేసిన జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలో దాదాపు 500 ఎకరాల్లో నాన్ లేఅవుట్ల గుర్తింపు
గత టీడీపీ హయాంలో పుట్టగొడుగుల్లా వెలసిన లేఅవుట్లు
జిల్లాలోని అక్రమ లేఅవుట్లను జనవరి లోపు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకోకపోతే చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారి కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 7 నుంచి 19 వరకు ఆయా మండల కేంద్రాల్లో ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు నాన్ లేఅవుట్లపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాన్ లేఅవుట్లు పరిస్థితి లేదు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం గత ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 630 జగనన్న లేవుట్లు చేసి పూడిక పనులు చేసింది. దాంతో మట్టి మాఫియాకు, పంచాయతీల్లో అక్రమ లేవుట్ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసింది. పేదలకు సెంటున్నర భూమి చొప్పున ఇవ్వడంతో గత వైఎస్సార్‌సీపీ పాలనలో గ్రామాల్లో అక్రమ లేఅవుట్ వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి.
నాన్ లేఅవుట్‌లపై కొరడా


