గోదావరిలో దూకి తండ్రీకొడుకులు మృతి
కుమార్తె కోసం గాలింపు
యలమంచిలి: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన శిరిగినీడి దుర్గాప్రసాద్ (40) కుమారుడు మోహిత్ సూర్య వినాయక్ (14), కుమార్తె జాహ్నవి సాత్విక్ (9)లను గోదావరిలో తోసి ఆ తర్వాత తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్గాప్రసాద్, వినాయక్ మృతదేహాలు లభించగా జాహ్నవి మృతదేహం కోసం గాలిస్తున్నారు. 16 ఏళ్ల క్రితం విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మీతో దుర్గాప్రసాద్‌కు వివాహమైంది. ఆధార్ అప్‌డేట్ చేయిస్తానని విశ్వేశ్వరాయపురంలో ఉన్న ఇద్దరు పిల్లలను సోమవారం తన బైక్‌పై ఎక్కించుకుని బయటకు తీసుకువచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దుర్గాప్రసాద్ బైక్, చెప్పులు చించినాడ వద్ద గోదావరి వంతెనపై ఉండడంతో గోదావరిలో దూకి ఉంటారని బావమరిది రమేష్‌బాబు సోమవారం రాత్రి యలమంచిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై కె.గుర్రయ్య కేసు నమోదు చేసి, గోదావరిలో గాలించగా మంగళవారం రాత్రి దుర్గాప్రసాద్, అతని కుమారుడు మోహిత్ సూర్య వినాయక్ మృతదేహాలు లభించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
భీమవరం: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీతో కలిపి మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకున్న చర్యలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని జూమ్ ద్వారా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా గంజాయి మాట విన్పించకూడదని, కేసులు గుర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని హెచ్చరించారు. మాదకద్రవ్యాల వినియోగంపై సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేసి ఈగల్ బృందానికి సమాచారం అందించాలన్నారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 12 కేసులు నమోదు కాగా 55 మందిని అరెస్టు చేసి 40.399 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు చెప్పారు. రహదారుల భద్రత విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. మంగళవారం కలెక్టర్ జిల్లా రహదారుల భద్రత సమావేశంలో పలు సూచనలు జారీ చేశారు. సమావేశంలో ఎస్పీ కూడా పాల్గొన్నారు.


