మద్యం షాపు ఎదుట ధర్నా
నరసాపురం రూరల్: మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తూర్పుతాళ్లు సెంటర్‌లో వైన్ షాప్ ఎదుట మంగళవారం సాయంత్రం పసలదీవి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన కొట్టు శివన్నారాయణ కుటుంబం కేపీపాలెం ఉప్పులూరు వారి మెరకలో నివసిస్తోంది. శివన్నారాయణ బంధువు సోమవారం అస్వస్థతకు గురవడంతో నరసాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో డబ్బు చెల్లించేందుకు కేపీపాలెం నుంచి బయలుదేరి సెంటర్‌లో వైన్ షాపు వద్ద శివన్నారాయణ ఆగి మద్యం సేవించాడు. అక్కడ తూర్పుతాళ్ళు చామకూరి వారి మెరకకు చెందిన ఓ వ్యక్తి అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడ్డ శివన్నారాయణను బంధువులు నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించాడు. ఈ గొడవ జరిగిన వైన్‌షాప్ వద్ద మంగళవారం సాయంత్రం పసలదీవి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఎస్సై నాగలక్ష్మి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో తూర్పుతాళ్లు సెంటర్‌లోని రెండు వైన్‌షాపులు నిర్వాహకులు మూసివేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడం దారుణమని పసలదీవికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పులపర్తి త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపుల వద్ద విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరగడమే ఈ గొడవకు కారణమని ఆయన విమర్శించారు.


