
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
తణుకు అర్బన్: పేద వర్గాలకు వైద్య విద్య, నాణ్యమైన వైద్యం ఉచితంగా అందాలంటే కూటమి ప్రభుత్వం చేపట్టిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రజలు నడుంకట్టాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా తణుకు 15వ వార్డు వీరభద్రపురంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టి ఐదు కాలేజీలను పూర్తిచేశారన్నారు. అయితే చంద్రబాబు సర్కారు మెడికల్ కాలేజీలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే క్రమంలో ప్రైవేటీకరణకు కంకణం కట్టుకుందని విమర్శించారు. వైద్యకళాశాలలు ఎక్కడా లేవని, జీవో కూడా విడుదల కాలేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు చెంపదెబ్బ మాదిరిగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనకాపల్లి వెళ్లి స్వయంగా వైద్య కళాశాల చూపిస్తే స్పీకర్ తోకముడిచారని గుర్తుచేశారు. తణుకుకు సమీపంలోని పాలకొల్లులో వైద్య కళాశాల పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తే ఎటువంటి ఆపరేషన్లు అయినా ఉచితంగా చేసే వీలుంటుందన్నారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచితే ప్రస్తుత కూటమి సర్కారు అటకెక్కించిందని విమర్శించారు.
జీఎస్టీ ఫ్లెక్సీలు విడ్డూరం
తణుకు ఎమ్మెల్యే జీఎస్టీ కారణంగా కుటుంబానికి రూ.15 వేలు పొదుపంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి కారుమూరి అన్నారు.
పేదలు రూ.2 లక్షలు ఖర్చుపెడితేనే రూ.15 వేలు పొదుపు వస్తుందని.. అయితే అంత మొత్తంలో ఖర్చుచేసే స్థితి పేదలకు ఉందా అని నిలదీశారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల రూపంలో ప్రజల ఖాతాలకు డబ్బులు జమచేసేవారని, దీంతో దీపావళి వంటి పండగల రోజుల్లో తణుకు ప్రాంతం కళకళలాడుతుండేదన్నారు. అయితే ప్రస్తుతం ప్రజలు, వ్యాపారులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితి ఎదురైందన్నారు. పేరు ప్రఖ్యాతలు ఉన్న తణుకులో నేడు కల్తీ మద్యం, పేకాట, గంజాయి విచ్చలవిడిగా సాగుతున్నాయన్నారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వద్దంటూ స్థానికులు పత్రాలపై సంతకాలు చేశారు. పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, ధనలక్ష్మి, 15వ వారు్‌డ్ నాయకులు గనసాల సింగ్, మల్లిపూడి వెంకట్రావు, ఆచంట లక్ష్మణరావు, కాసగాని రామన్న, నూతంగా సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి