
కిడ్నాప్ కలకలం
తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్ సెంటర్‌కు వచ్చి దుకాణం వద్ద టీ తాగుతున్నాడు. ఇంతలో ఓ కారులో నుంచి ముఖానికి ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు దిగి టీ తాగుతున్న వ్యక్తిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. దీంతో అక్కడున్న వారు నిర్ఘాంతపోయారు. విషయం తెలిసిన పట్టణ సీఐ బోణం ఆదిప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సమీపంలోని హోటల్‌లో ఉన్న సీసీ ఫుటేజీల్లో కిడ్నాప్ ఘటన నమోదు కావడంతో వాటిని సేకరించి పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో వర్క్ అవుట్ సోర్సింగ్ పేరిట ప్రైవేటీకరణ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించడాన్ని సీఐటీయూ వ్యతిరేకిస్తోందని జిల్లా కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ అన్నారు. వర్క్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ శనివారం ఏలూరు ఆర్‌ఆర్‌పేట మస్తర్ పాయింట్ వద్ద కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరులో ఈ విధానాన్ని సీఐటీయూ తిప్పికొట్టిందని, ఆ సందర్భంలో రాష్ట్రంలో మరెక్కడా అమలు చేయమని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారన్నారు. అయితే ఏలూరు కార్పొరేట్‌లో పనులను ప్రైవేట్ వ్యక్తలకు అప్పగించాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి ఎ.జానుబాబు, నగర కార్యదర్శి ఎం.ఇస్సాకు, జిల్లా కార్యదర్శి జె.గోపి పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నారాయణ, చైతన్య విద్యాసంస్థలు సెలవు రోజుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నాయంటూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో శనివారం తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను మూయించివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థల్లో రోజులో కనీసం గంట కూడా క్రీడలు నిర్వహించకపోవడంతో విద్యార్థులకు మానసిక వికాశం, స్వేచ్ఛ ఉండటం లేదన్నారు. అలాగే ఎన్ శాట్ స్కాలర్‌షిప్ పేరుతో ఆదివారం నారాయణ విద్యాసంస్థలు నిర్వహించే పరీక్షకు ప్రభుత్వ అనుమతి లేదన్నారు. ఆయా సమస్యలపై విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వై.అభి, టి.వంశీ, ఎస్.రాజా పాల్గొన్నారు.
భీమవరం: కల్లుగీత వృత్తిని లేకుండా చేయాలనుకుంటే పాలకులకు భవిష్యత్ ఉండదని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి హెచ్చరించారు. శనివారం భీమవరం సీఐటీయూ కార్యాలయంలో కామన మునిస్వామి అధ్యక్షతన జరిగిన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి సహజసిద్ధమైన తాటికల్లును తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కనుమరుగు చేసి కల్తీ మద్యాన్ని, అక్రమ మద్యాన్ని కుటీర పరిశ్రమలుగా నడుపుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కిస్తీలు రద్దు చేసి గీత వృత్తిని లేకుండా కనుమరుగు చేయా లని నిర్ణయం తీసుకున్నారని, ఎన్నికల్లో ఓట్లు కోసం చేసిన వాగ్దానాలతో తమ తలరాతలు మారుస్తారేమో అని నమ్మి ఓట్లేసిన పాపానికి ప్రభుత్వం గీత కార్మికులకు చుక్కలు చూ పిస్తోందని విమర్శించారు. గీత కార్మికులను కులాలుగా చీల్చి గీత వృత్తిని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న 75 వేల అక్రమ బెల్ట్ షాపులు తక్షణం తొలగించాలని, కల్తీ మద్యం అరికట్టి కల్లును ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. మునిస్వామి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొత్త యంత్రాలతో కుటీర పరిశ్రమలుగా విస్తరించిన స్పిరిట్ మద్యాన్ని తక్షణం అరికడితేనే కల్లుగీత వృత్తి ఉంటుందన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు బొక్కా చంటి, కడలి పాండు, మామిశెట్టి నాగభూషణం తది తరులు పాల్గొన్నారు.

కిడ్నాప్ కలకలం