
జిల్లాను ముంచెత్తిన వాన
నీట మునిగిన ప్రాంతాల పరిశీలన
● తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం
● జలమయమైన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు
● రాకపోకలకు ఇక్కట్లు
టీడీపీ నాయకుల నకిలీ మద్యం వ్యాపారం, కూటమి ప్రభుత్వ మద్యం విధానాలను నిరసిస్తూ సోమవారం వైఎస్సార్‌సీపీ నిర్వహించతలపెట్టిన రణభేరి వర్షం కారణంగా పలు నియోజకవర్గాల్లో తాత్కాలికంగా వాయిదా పడింది. తణుకు, పాలకొల్లు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కాగా ఉదయం నుంచి వర్షం తెరిపివ్వకపోవడంతో భీమవరం, ఉండి, ఆచంట, నరసాపురం, తాడేపల్లిగూడెంలలో వాయిదా వేశారు. ఆయా నియోజకవర్గాల్లో మంగళవారం రణభేరి కార్యక్రమం యదావిధిగా జరుగనున్నట్టు పార్టీ జిల్లా కార్యాలయ వర్గాలు తెలిపాయి.
సాక్షి, భీమవరం: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. రోడ్లు, పల్లపు ప్రాంతాలు జలమయమై రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. నకిలీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నిర్వహించతలపెట్టిన రణభేరీ పలు నియోజకవర్గాల్లో వాయిదా పడింది.
తెల్లవారుజాము సమయంలో ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం మధ్యాహ్నం వరకు తెరిపివ్వకుండా కురుస్తూనే ఉంది. సోమవారం కావడంతో ఉదయాన్నే విద్యాసంస్థలు, ఆఫీసులకు వెళ్లేవారు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనం లేక మార్కెట్లు వెలవెలబోయాయి. ఎక్కడికక్కడ రోడ్లపై గోతులు వర్షపు నీటితో నిండిపోయి కనిపించక పలుచోట్ల ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాల పాలైన ఘటనలు చోటుచేసుకున్నాయి. భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు బస్టాండుల్లో వర్షపునీరు నిలిచిపోయి ప్రయాణికులు అవస్థలు పడ్డారు. భీమవరంలోని రజకుల కాలనీ, ఇందిరమ్మ నగర్, హౌసింగ్‌బోర్డు, మెంటేవారితోట, గునుపూడి, ఫైర్‌స్టేషన్, బ్యాంక్ కాలనీలోని పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో డ్రెయిన్లలోని చెత్త రోడ్లపైకి చేరడంతో దారిన వెళ్లే వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యటించారు. ముంపు సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. భవిష్యత్తులో ముంపు సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని కమిషనర్ కె.రామచంద్రారెడ్డికి సూచించారు. ముంపునీరు లాగేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, తాగునీటిని క్లోరినేషన్ చేయించాలని, వ్యాధులు ప్రబలకుండా ముంపు ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించాలని ఆదేశించారు.
పాలకొల్లు హౌసింగ్‌బోర్డు కాలనీ, బస్టాండ్ సెంటర్, సలాదివారి తోట, బంగారువారి చెరువుగట్టు, బ్రాడీపేట, బెత్లహం పేట, వీవర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షపునీరు, మురుగునీరు ఏకమై రోడ్ల మీదకు చేరడంతో ప్రజలు, వాహనదారులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్టాండ్‌లో మోకాలిలోతు నీటిలో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర, పోడూరు మండలాల్లో శివారు ప్రాంత కాలనీల్లో వర్షంతో ఇబ్బందులు పడ్డారు. డ్రెయినేజి వ్యవస్థలు లేకపోవడంతో రోడ్లపైనే వర్షపు నీరు నిలిచిపోయింది. మురుగుతో కలిసి నీరు రోడ్డుపై ప్రవహించడంతో దుర్వాసనతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. తణుకులో రైల్వే స్టేషనన్ రోడ్డు, మున్సిపల్ ఆఫీస్ రహదారులు నీట మునిగాయి. ఆకివీడులో భారీ వర్షానికి రోడ్లు, డ్రెయిన్లు నీట మునిగాయి. జాతీయ రహదారి ముంపునకు గురైంది. సంతపేట, శాలిపేట, జవహర్ నగర్, రైల్వే స్టేషన్ రోడ్డుతోపాటు పలు గ్రామాల్లోని రహదారులు నీట మునిగాయి.
ఉండి మండలంలో..
ఉండి: ఉండి మండల రెవెన్యూ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, గ్రామ సచివాలయం, పోలీస్ స్టేషన్, డ్వాక్రా కార్యాలయాలకు వెళ్ళే రహదారి పూర్తిగా మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోండ్రోతుపేట, శివాలయం, ఎంపీపీ స్కూల్‌కు వెళ్ళే రహదారి కాలువలా మారిపోయింది. గోరింతోటలో ప్రాథమిక పాఠశాలలోకి వర్షపునీరు చేరడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు వర్షపు నీటిలోనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలో నీటమునిగిన ప్రాంతాలకు కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. రజకుల కాలనీ, హౌసింగ్ బోర్డ్, ఇందిరమ్మ నగర్, మెంటేవారి తోట, పిపి రోడ్డు ప్రాంతాల్లో పరిశీలించి మున్సిపల్ అధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. డ్రైయిన్లలో చెత్తాచెదారం, అడ్డంకులను తొలగించడంతోపాటు రోడ్డుకు ఇరువైపులా మెరక ప్రాంతాలను చదును చేయాలని ఆదేశించారు. పీపీ రోడ్డులో రిలయనన్స్ పెట్రోల్ బంకు, గోడౌన్ మధ్య ఇరువైపులా నీరు నిలవడంతో అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోడ్లు వేస్తే సరిపోదని, నీళ్లు నిలిచిపోతే రోడ్లు ఉంటాయా అని ప్రశ్నించారు.

జిల్లాను ముంచెత్తిన వాన

జిల్లాను ముంచెత్తిన వాన

జిల్లాను ముంచెత్తిన వాన