
చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు
చింతలపూడి/లింగపాలెం: ఇటీవల లింగపాలెం మండలంలో చైన్ స్నాచింగ్ , దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను పట్టుకుని, సొమ్మును రికవరీ చేసినట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. ఏలూరు పట్టణానికి చెందిన చవల భార్గవ కృష్ణ, భరగడ హర్ష వర్ధన్, కాకర్లపర్తి గణేష్, బద్ది హేమ అచ్యుత్, కోలా అప్పల రాజు గత నెల 23న ధర్మాజీగూడెంలో ఒడ్డు కట్టు చెరువు రోడ్డు బాపిరాజు గూడెంలో బొల్లా నాగలక్ష్మి నుంచి బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కుని ద్విచక్ర వాహనాలపై పారిపోయారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐ టి.క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ధర్మాజిగూడెం ఎస్సై వెంకన్నబాబు సిబ్బందితో కలిసి సోమవారం ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి నుంచి పలు నేరాల్లో సుమారు 80 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెడు అలవాట్లకు, సులభంగా డబ్బు సంపాదించాలి అనే ఆశతో చదువుకునే యువత దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీఎస్‌పి అభినందించారు.
బాణసంచా నిల్వ చేస్తే కఠిన చర్యలు
అనధికారికంగా బాణసంచా నిల్వ చేసిన, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో మండలంలోని పలు ప్రాంతాల్లో అనధికారకంగా బాణసంచా నిల్వ ఉంచిన ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని తెలిపారు. దాడుల్లో ప్రగడవరం గ్రామంలో మూడు చోట్ల ఐదు లక్షల విలువైన అక్రమ మందు బాణసంచా గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు.