
శివశివా.. ఇదేం దారుణం?
● క్షేత్రపాలకుని ఆలయంలో యాగశాల షెడ్డు తొలగింపు
● వర్షం కురవడంతో ఆలయ మండపంలో రుద్ర హోమం నిర్వహణ
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకునిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం జరిగిన రుద్ర హోమాన్ని వీక్షించిన భక్తులు శివశివా.. ఇదేం దారుణమంటూ ముక్కున వేలేసుకున్నారు. శాస్త్రోక్తంగా హోమకుండంలో జరగాల్సిన ఈ హోమాన్ని తాపీ పనులకు వినియోగించే గమేళాలో నిర్వహించడం పట్ల పలువురు భక్తులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే శివదేవుని ఆలయంలో ధ్వజస్తంభం ఎదురుగా, ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న యాగశాల షెడ్డులో ప్రతి సోమవారం రుద్ర హోమాన్ని జరుపుతారు. అందులో రూ.516 లు రుసుము చెల్లించి దంపతులు పాల్గొంటారు. ఇదిలా ఉంటే వేరే ప్రాంతంలో యాగశాలను నిర్మించే ఉద్దేశంతో, దేవస్థానం అధికారులు మూడు రోజుల క్రితం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రస్తుత యాగశాల షెడ్డును అకస్మాత్తుగా తొలగించారు. అయితే అందులో హోమకుండం భాగానే ఉండడంతో అర్చకులు సోమవారం ఉదయం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, హోమ నిర్వహణకు అంతా సిద్ధం చేశారు. ఇంతలో వర్షం కురవడంతో అర్చకులకు ఏం చేయాలో? పాలుపోలేదు. అప్పటికే నలుగురు భక్తులు హోమంలో పాల్గొనేందుకు ఆన్‌లైన్ టికెట్లను కొనుగోలు చేశారు. అలాగే భక్తులు ఉన్నా.. లేకపోయినా ఈ హోమాన్ని జరపడం పరిపాటి. దాంతో అర్చకులు తప్పనిసరి పరిస్థితుల్లో, వేరే గత్యంతరం లేక ఆలయ మండపంలో, తాపీ పనులకు వినియోగించే గమేళాలో ఈ రుద్ర హోమాన్ని నిర్వహించారు. ఇది చూసిన భక్తులు విస్తుపోయారు. శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, పురాణ పాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఇలాంటి పరిస్థితులను చూసిన భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అయితే ఈ ఘటనపై సెక్షన్ సూపరింటిండెంట్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ షెడ్డు తొలగించిన వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నది వాస్తమేనని అంగీకరించారు. అయితే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్లు పనిలోపడి మర్చిపోయారని, వర్షం కారణంగా ఉదయం టెంటు నిర్మించడం కుదరలేదన్నారు. అర్చకులు ప్రత్యామ్నాయంగా ఆలయంలో రుద్ర హోమాన్ని జరిపారన్నారు.