
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. గురువారం ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఈన ెల 9 వరకు వైభవంగా జరగనున్నాయి. ఆలయాన్ని, పరిసరాలను విద్యుత్ దీప తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. దాంతో ఆలయ రాజగోపురాల సముదాయం, అనివెట్టి మండపం, కొండపైన ఘాట్ రోడ్లు పరిసర ప్రాంతాలు విద్యుత్ దీప కాంతులతో మిరమిట్లు గొలుపుతున్నాయి. ఆలయంలో పుష్పాలంకరణ పనులు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. స్వామివారు ఉదయం, రాత్రి వేళల్లో విహరించే వాహనాలను ముస్తాబు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదిక సిద్ధమైంది. గురువారం ఉదయం 9.30 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేయడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు.