
యువకుడి అదృశ్యం కేసులో వీడని మిస్టరీ
తణుకు అర్బన్ : తణుకులో అదృశ్యమైన తాడేపల్లిగూడేనికి చెందిన మడుగుల సురేష్ (25) కేసులో నెలకొన్న మిస్టరీ ఇంకా వీడలేదు. అదృశ్యమై పది రోజులు గడిచిపోవడం, తణుకు గోస్తనీ కాలువతోపాటు చించినాడ గోదావరిలో సైతం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఆనవాళ్లు దొరక్కపోవడంతో పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. ఈ కేసులో బాధిత వర్గాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజుతో పాటు పట్టణానికి చెందిన మరో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పటికీ సురేష్ జాడ తెలుసుకోలేకపోవడం గమనార్హం. సురేష్‌ది హత్యగా నిర్ధారించుకుని విచారణ చేస్తున్నా నిందితులు మృతదేహాన్ని మాయం చేసిన తీరు పోలీసులను గందరగోళానికి గురి చేస్తుంది. బుధవారం చించినాడ గోదావరిలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సురేష్ జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఎలాంటి సాక్ష్యాలు బయటపడకపోడంతో గురువారం మళ్లీ తిరిగి గాలింపు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న సురేష్ తన సన్నిహితురాలు శిరీష ఇంటికి వచ్చిన విషయాన్ని స్థానికంగా ఉన్న నిందితుడి అనుచరుడు ఇచ్చిన సమాచారంతో రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారని, ఈ క్రమంలో చేసిన దాడిలో సురేష్‌కు తీవ్రగాయాలు కాగా కారులో తరలించి చించినాడలోని గోదావరిలో పారవేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
భీమవరం: పట్టణంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని టూటౌన్ ఎస్సై ఫజుల్ రహమాన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని లంకపేటకు చెందిన బొబ్బనపల్లి హరీష్‌బాబు తన స్నేహితుడు కొరాడ లక్ష్మీనారాయణతో కలిసి దుర్గాపురం నుంచి టీ తాగడానికి మోటారు సైకిల్‌పై వస్తుండగా వేగంగా వస్తున్న కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అనంతరం ఆగకుండా హరీష్‌బాబు ప్రయాణిస్తున్న మోటారుసైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్‌పై ఉన్న ఇద్దరు రోడ్డుపైపడి గాయపడ్డారు. వీరిని స్థానికులు చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రహమాన్ పేర్కొన్నారు.