
అక్రమంగా మట్టి నిల్వలు
ఆగిరిపల్లి: టీడీపీ నేతల ఆధ్వర్యంలో మండలంలో మట్టి దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. మూడు నెలల క్రితం పొలాల మెరక కోసమని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అనుమతులు తీసుకున్నారు. కానీ చెరువులోని మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వి మట్టిగుట్టలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈదులగూడెంలోని ఈము కోళ్ల ఫామ్ ఎదురు రోడ్‌లో వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకొని దానిలో సుమారు 4 వేల ట్రక్కుల మట్టిని అక్రమంగా నిల్వ ఉంచారు. ఈ మట్టి మొత్తం ఇటుక బట్టీలకు తరలించడానికి సిద్ధం చేశారని గ్రామస్తులు తెలిపారు. ఈ మట్టిని ఇటుక బట్టీల వాళ్లకి రూ.50 లక్షలకు బేరం కూడా కుదిరినట్టు సమాచారం. బట్టీలకు మట్టిని తరలించడానికి 2 ఎస్కలేటర్లు, 25 ట్రాక్టర్లను సిద్ధం చేయగా గత వారం రోజుల నుంచి వర్షాలు కురవడంతో మట్టిని తరలించడానికి వీలుపడలేదు. అధికార పార్టీ నాయకులు కావడంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అక్రమంగా మట్టి నిల్వలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.