
శ్రీవారి క్షేత్రంలో ‘ఉట్టి’ ఉత్సవం
ద్వారకాతిరుమల: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల చినవెంకన్న దివ్య క్షేత్రంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఉట్లు పండుగ, శ్రీవారి తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రాజాధిరాజ వాహనంపై ఉంచి అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. తొలుత స్వామివారి కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఉట్టిని యువకులు ఆనందోత్సాహాల నడుమ కొట్టారు. ఉట్టికొట్టిన యువకుడిని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి అభినందించారు. ఆ తరువాత స్థానిక తూర్పు వీధి, పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన ఉట్లను యువకులు ఉత్సాహంగా కొట్టారు. ఈ సందర్భంగా తూర్పు వీధిలో పలువురు చిన్నారులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలతో సందడి చేశారు.